కాసుల కనికట్టు!
►నీరు చెట్టు పథకం నిధులు స్వాహాకు పాలకపక్షం కుట్ర
►అనుమతులు లేకుండానే ఓ చెరువు పనులు
►తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులకోసం పట్టు
►పర్యవేక్షణపై పరస్పరం ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్న అధికారులు
►పూర్తిస్థాయి విచారణ చేపట్టాలంటున్న రైతులు
నీరు చెట్టు పనులవల్ల అభివృద్ధి మాటెలా ఉన్నా... పాలకపక్ష ఛోటామోటా నేతలు మాత్రం కాసులు కూడబెడుతున్నారు. అనుమతులు తీసుకోకున్నా... పనులు చేపట్టేసి ఆనక బిల్లుల కోసం పట్టుబడుతున్నారు. పోనీ పనులైనా నాణ్యంగా ఉంటున్నాయా... అంటే అదీ
లేదు. తూతూ మంత్రంగా ఏదో చేశామనిపించేస్తున్నారు. అధికారులు సైతం ఏమాత్రం పరిశీలించకుండా... అనుమ తుల గురించి ప్రశ్నించకుండా... అడిగిన బిల్లులు ఇచ్చేస్తున్నారు.
విజయనగరం: నీరు–చెట్టు కార్యక్రమంలో చెరువుల అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతులు లేకుండానే పనులు తూతూ మంత్రంగా చేసేసి... బిల్లులకోసం అధికారులపై ఒత్తిడి చేసి పనులను రికార్డింగ్ చేయించుకుంటున్నారు. ఇలాంటి కుట్రే ఒకటి లక్కవరపు కోటలో వెలుగు చూసింది. లక్కవరపుకోట మండలంలోని గొల్జాం గ్రామ సమీపంలో గల ఒబులారాయుడు చెరువులో నీరు– చెట్టు పథకంలో అభివృద్ధి చేసేందుకు సుమారు రూ. 10లక్షలు వేపాడ మండలం నుంచి మంజూరయ్యాయి. ఈ చెరు వు గర్భం సుమారు 125 ఎకరాలు పూర్తి గా వేపాడ మండలంలో వుంది. చెరువు కింద ఆయకట్టు భూములు సుమారు 245 ఎకరాలు సీతారామపురం, గొల్జాం గ్రామాలు లక్కవరపుకోటలో వున్నాయి. నిధులు మంజూరయ్యేసరికి గొల్జాం గ్రా మానికి చెందిన తూర్పాటి జానకీరావు, రామారావు అనే ఇద్దరు వ్యక్తులు పనులు ప్రారంభించారు. రెండు జేసీబీలతో పనులను ప్రారంభించి మట్టిని నిబంధనలకు విరుద్ధంగా చెరువు పైభాగం వైపు వేసి పూర్తి చేశామనిపించారు.
ఇద్దరూ టీడీపీ నాయకులే...
జానకీరావు టీడీపీ తరఫున చెరువు ఆయకట్టు సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా... రామారావు గ్రామ స్థాయి టీడీపీ నాయకుడిగా ఉన్నారు. నిజానికి ఇక్కడ ఏ పని చేయాలన్నా అగ్రిమెంటు ఆయకట్టు సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షుల పేరుమీదే జరగాలి. వారు తమకు నచ్చిన వారికి నామినేటెడ్ పద్ధతిలో పనులు అప్పగించి వాటాలు పంచుకోవడం ఆనవాయతీ. కానీ ఈ చెరువు విషయంలో పని పూర్తయినా నేటికీ వర్క్ అగ్రిమెంట్ జరగలేదు.
అసలు ఈ పనులు ఫలాన వ్యక్తి నిర్వహించాలనేది ఇంతవరకూ అధికారులు చెప్పలేదు. పైగా ఈ పనుల పర్యవేక్షణ తమది కాదంటే తమదికాదం టూ అధికారులు తప్పించుకోవడం విశే షం. వేపాడ మండల నీటి పారుదలశాఖ జేఈ సాయిలక్ష్మి రూ 10లక్షల అంచనాలతో పనులను గుర్తించారు. పనులు నిర్వహించే బాధ్యతమాత్రం లక్కవరపుకోట నీటిపారుదలశాఖ జేఈ చంద్రశేఖర్‌దని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. పని అంచనా వేసి నిధులు మంజూ రు చేసే వరకే తమ పని అని ఆమె అంటున్నారు. కానీ నిధులు ఏ మండలం నుంచి విడుదలైతే ఆ మండల జేఈ పనులు పర్యవేక్షించాలని, తమకు సంబంధం లేదని లక్కవరపుకోట జేఈ చంద్రశేఖర్ చెబుతున్నారు.