సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘మింగ మెతుకులేదు గానీ మీసాలకు సంపెంగ నూనె పెడదాం’ అన్నాడట వెనకటికి ఒకరు.. జిల్లాలోని చెరువుల దయనీయ పరిస్థితిపై సర్కారు నిర్లక్ష్య వైఖరిని గుర్తుకు తెస్తోందీ సామెత. ఏళ్లుగా నీరు చేరక అడుగంటిపోతున్న చెరువులకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి అవి నీటితో కళకళలాడేలా చూడాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు.. కానీ చెరువులు నిండితే ఆ నీటిని పొలాలకు పారించేందుకు ఉన్న కాల్వలకు మరమ్మతులు చేపట్టాలంటూ రూ.కోట్లు విడుదల చేసింది.
ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు చెరువులకు సంబంధించిన కాల్వల మరమ్మతుల కోసం 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.4 కోట్లు మంజూరు చేసింది. క్రమంగా అడుగంటిపోతున్న ఆయా చెరువులకు ప్రస్తుతం ఈ పనులు అక్కర్లేదంటూ నీటి పారుదల శాఖ అధికారులు చేతులు దులుపుకోవడంతో సర్కారు విడుదల చేసిన నిధులు ఏడాది నుంచి ఖజానాలోనే మూల్గుతున్నాయి.
ఏమిటీ ఉల్టా పల్టా?
జిల్లాలో భారీ నీటి ప్రాజెక్టులేవీ లేకపోవడంతో 90 శాతం రైతులు భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. చెరువులను పరిరక్షిస్తే.. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు మెరుగుపడతాయి. ఈ నేపథ్యంలో చెరువుల్లోకి నీరు చేరేలా చర్యలు చేపట్టాలి. కానీ నీటిపారుదల శాఖ అధికారుల ప్రణాళిక లోపంతో చెరువుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ప్రస్తుతం జిల్లాలో పెద్ద చెరువైన ఇబ్రహీంపట్నం, రావిర్యాల, తిమ్మాపూర్ చెరువులు పూర్తిగా నిండితే దాదాపు మూడేళ్ల వరకు 6 వేల ఎకరాల్లో పుష్కలంగా పంటలు పండుతాయి. కానీ ఈ చెరువుల్లోకి నీరు చేరే ప్రధాన కాల్వ ఫిరంగి నాలా ఆక్రమణలతో కుంచించుకుపోయింది.
చిన్నపాటి కాల్వలు ఇసుక తవ్వకాలకు గురికావడంతో అవన్నీ నీటి ప్రవాహానికి ప్రతిబంధకంగా మారాయి. ఈ తరుణంలో నీరు చేరే మార్గాలను పునరుద్ధరించాల్సి ఉండగా.. అధికారులు మాత్రం పొలాలకు నీరు చేర్చే మార్గాల మరమ్మతులకు ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. 2013-14లో ప్రభుత్వం రూ.4 కోట్లు విడుదల చేసింది. అయితే స్థానిక రైతుల ఒత్తిడి, ప్రజాప్రతినిధుల జోక్యంతో ఈ పనులు చేపట్టేందుకు అధికారులు సాహసించలేదు. ఫలితంగా నిధులు ఖజానాలో ఉండిపోయాయి.
ఆ నిధులు వెనక్కేనా?
నీటి పారుదల కాల్వల మరమ్మతులకు విడుదలైన రూ.4 కోట్లను వెనక్కు పంపాలని జిల్లా నీటిపారుదల శాఖ ఇంజినీర్లు యోచిస్తున్నారు. వాస్తవానికి చెరువుల్లోకి నీరు చేరే మార్గాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. కానీ అందుకు నిధులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న రూ.4 కోట్లను ఈ పనులకు వినియోగిస్తే మంచి ఫలితాలుండేవి. ప్రస్తుతం సీజన్ సమీపించినా వర్షాలు కురవకపోవడం.. మున్ముందు భారీ వర్షసూచన ఉండడంతో చెరువులకు నీరు చేరే విధంగా చర్యలు చేపట్టాలి. కానీ ఆ దిశగా దృష్టి సారించని ఇంజినీరింగ్ అధికారులు.. అక్కరకు రాని రూ.4 కోట్లను వెనక్కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఒకట్రెండు రోజుల్లో లిఖితపూర్వకంగా వివరించనున్నట్లు ఆ శాఖలోని ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
రూ.4 కోట్లు వెనక్కు పోయే అవకాశం..
Published Sun, Jul 27 2014 10:53 PM | Last Updated on Mon, Sep 17 2018 8:04 PM
Advertisement
Advertisement