గీతం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న రామారావు
పటాన్‌చెరు: ‘రోజువారీ కార్యకలాపాలను సాధారణంగా ఎడమవైపు ఉన్న మెదడు నయంత్రిస్తుందని, సమాజంలోని చాలా మంది సహజంగానే దానికి అలవాటు పడిపోతారని ’ బార్క్ పూర్వ శాస్త్రవేత్త జి.ఎ.రామారావు అన్నారు. గురువారం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ‘సాఫ్ట్ స్కిల్స్ ఫర్ ఎ హెల్తీ మైండ్’ అనే అంశంపై జరిగిన ఓ వర్క్‌షాప్‌లో ఆయన శిక్షకుడిగా పాల్గొన్నారు.
బాబా అణు పరిశోధన సంస్థ(బార్క్) పూర్వ శాస్త్రవేత్తగా జి.ఎ.రామారావు విద్యార్థులకు మెదడు పనితీరుతో పాటు సానుకూల దృక్పథంపై పలు కీలక సూచనలు, వివరణలు ఇచ్చారు. అంతా బాగుందనే మానసిక భావనే సానుకూల దృక్పథమని అదే విజయానికి సోపానమని వివరించారు. సానుకూల ఆలోచన పురోగతి వైపు సాగుతుందన్నారు.
మన శరీరంలోని అంగాలన్నీ బాగా పనిచేస్తున్నాయనే భావన కలిగి ఉంటే చన్ని చిన్న రుగ్మతలు కూడా మననేమీ చేయలేవని ఆయన చెప్పారు. కాని ఏదో నలతగా ఉందే ఆందోళన మానసింగా కృంగదీస్తుందని, ప్రతికూల ఆలోచనలను (నెగెటివ్ మైండ్‌సెట్) విడనాడాలని సూచించారు.
నిద్రలేమి గురించి కలత చెందవద్దని, బాగా నిద్రించాననే సానుకూల భావన ద్వారా దానిని అధిగమించి పునరుత్తేజితులు కావాలన్నారు. మెదడు పనితీరును ఆయన వివరిస్తూ ఎడమవైపు మెదడునే ఎక్కువగా వాడుతామన్నారు. అందువల్ల కుడివైపున ఉన్న మెదడును మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామన్నారు.
రోటీన్‌కు భిన్నంగా పనులు చేస్తుంటే రెండు మెదడుల మధ్య సమన్వయం పెరిగి ఆలోచనలను వస్తిరింప చేసుకోవచ్చని సూచించారు. రోజూ కొద్దిసేపు నేలపై కూర్చోవడం, ఒక్క చేత్తో చేయడానికి అలవాటు పడ్డ పనిని మరో చేతితో చేసేందుకు ప్రయత్నించడం వంటి చిన్ని చిన్న అభ్యాసాల(మార్జాలసనం, శలభాసనంలో కొన్ని మార్పుల) ద్వారా మేధస్సును వికసింప చేసుకోవచ్చన్నారు.
‘సంతోషమే సగం బలం’ అనేది నానుడని ఆనందంగా ఉంటేనే కుడివైపు మెదడు పనిచేస్తుందని రామారావు వివరించారు. కొంత సాధనతో విద్యార్థులు ఏకాగ్రతను అలవరచుకోవడం సాధ్యమేనన్నారు. ఒంటి కాలిపై నిలబడి ఒక కేంద్రాని‍్న ఎంపిక చేసుకుని దానిపై దృష్టినిలిపి తేదకంగా గమనించాలని, ఆలోచనలను నియంత్రించి ఏకాగ్రత సాధించే ప్రయత్నం చేయాలన్నారు.యోగలోని వృక్షాసనం, గరుడాసనం, నటరాజాసనం, వంటి బ్యాలెన్సింగ్ ఆసనాలను సాధన చేయాలన్నారు.
చివరగా యోగనిద్ర ద్వారా సౌభ్రాతృత్వ, ఏకత్వ భావనలను పెంపొందించుకోవచ్చన్నారు. సానుకూల సమైక్య భావనలను యోగనిద్రలో పెంపొందించుకోవచ్చని ఆయన వివరించారు. దాదాపు వంద మంది బిటెక్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో శిక్షణ పొందారు.