పవార్ రామారావుపటేల్, బోస్లే నారాయణరావుపటేల్
సాక్షి, ఆదిలాబాద్: భైంసా మండలం బడ్‌గాం గ్రామానికి చెందిన బోస్లే గోపాల్‌రావుపటేల్ – కమలాబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. బోస్లే నారాయణరావుపటేల్, బోస్లే మోహన్‌రావుపటేల్. భైంసాలో జిన్నింగ్ ఫ్యాక్టరీ నడిపే ఇరువురు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 1994 ఎన్నికల్లో టీడీపీ నుంచి మొదటిసారి బరిలో దిగిన నారాయణరావుపటేల్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డెన్నపై గెలుపొందారు. అలాగే పవార్ శ్యాంరావుపటేల్ – రాధాబాయిల కుమారుడైన పవార్ రామారావుపటేల్ ఇద్దరికీ వరుసకు సోదరుడు. అక్కాచెల్లెల్ల పిల్లలైన ఈ ముగ్గురు కలిసి వ్యాపారం చేసేవారు. ఒకేచోట ఉన్న వీరు పరిస్థితులతో రాజకీయ పార్టీలు వేరై ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు.
ఆసక్తికరంగా పోటీ..
ముధోల్ అసెంబ్లీ బరిలో ఇద్దరు అన్నదమ్ములు నిలిచారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పవార్ రామారావుపటేల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోస్లే నారాయణరావుపటేల్ పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లోనూ ఇద్దరు అన్నదమ్ముళ్లు బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పవార్ రామారావుపటేల్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోస్లే నారాయణరావుపటేల్‌లు బరిలో నిలిచారు. 2018 ఎన్నికల్లో బోస్లే నారాయణరావుపటేల్, బోస్లే మోహన్‌రావుపటేల్‌లు నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటర్ల వద్దకు ప్రచారానికి వెళ్లారు. 2023 ఎన్నికల్లో బోస్లే మోహన్‌రావుపటేల్ పవార్ రామారావుపటేల్‌కు మద్దతు తెలుపుతున్నారు.
ఒకప్పుడు ముగ్గురు ఒక్కటే..
1994 ఎన్నికల నుంచి 2009 ఎన్నికల వరకు ముగ్గురు అన్నదమ్ముళ్లు ఏకతాటిపైనే ఉండేవారు. 1994 ఎన్నికల్లో బోస్లే నారాయణరావుపటేల్ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో వ్యాపారాలు పవార్ రామారావుపటేల్, బోస్లే మోహన్‌రావుపటేల్ చూసుకునేవారు. ముగ్గురు అన్నదమ్ముళ్లు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉండేవారు. గడిచిన పదేళ్లలో రాజకీయ వైరుధ్యాలతో వేర్వేరుగా పోటీచేస్తున్నారు. అన్నదమ్ముళ్లే ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఇరువురు సోదరులు రెండు జాతీయ పార్టీల నుంచి పోటీచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment