ప్రచారంలో ఆర్భాటం.. ఫలితాల్లో నిర్లక్ష్యం | pracharamlo arbatam.. results lo nirlakshyam | Sakshi
Sakshi News home page

ప్రచారంలో ఆర్భాటం.. ఫలితాల్లో నిర్లక్ష్యం

Published Sun, Jul 17 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

ప్రచారంలో ఆర్భాటం.. ఫలితాల్లో నిర్లక్ష్యం

ప్రచారంలో ఆర్భాటం.. ఫలితాల్లో నిర్లక్ష్యం

ప్రభుత్వం ప్రచార ఆర్భాటంలో చూపించిన ఉత్సాహం ఆయా పథకాల అమలుకు వచ్చేసరికి చతికలపడుతోంది. భూసార పరీక్షలంటూ ఊరూవాడా విస్తృతంగా ప్రచారం చేసిన వ్యవసాయ శాఖ.. సార్వా పనులు ప్రారంభమై నెల కావస్తున్నా ఇప్పటికీ ఆ ఫలితాలను రైతులకు అందించలేదు. ఏయే ఎరువులు ఎంత మోతాదులో వేయాలన్న విషయంపై స్పష్టత కరువైంది. 
భీమవరం : భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలు సేకరించి రెండున్నర నెలలు గడుస్తున్న ఇప్పటికీ ఆ ఫలితాలు రైతులకు చేరలేదు. దీంతో వారికి ప్రయోజనం లేకుండా పోయింది. సార్వా సీజన్‌ జిల్లాలో నెల క్రితమే ప్రారంభమైంది. చాలా వరకు నాట్లు కూడా పూర్తికావచ్చాయి. ఇప్పటికీ మట్టి నమూనాల ఫలితాలు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
జిల్లాలో 72,452 నమూనాల సేకరణ
ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధిస్తున్నా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, ధాన్యానికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో వ్యవసాయమంటేనే రైతులు హడలెత్తిపోతున్నారు. వరి సాగులో అధిక ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం భూసార పరీక్షలను నిర్వహించి దానికనుగుణంగా ఎరువులు వాడకం వల్ల ఖర్చు తగ్గించడంతో పాటు మరింత దిగుబడి సాధించవచ్చునని రైతులకు విస్తృతంగా ప్రచారం చేసింది. జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కూడా వేసవిలో ప్రకటనలతో ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో రైతులు గతంలో ఎన్నడూ లేనంతగా తమ భూముల్లో మట్టి నమూనాలు సేకరించి వ్యవసాయ అధికారులకు అందజేశారు. వరి, ఇతర పంటలకు సంబంధించి 56,226 నమూనాలు రాగా ఉద్యాన పంటలకు సంబంధించి 16,226 వచ్చాయి. మొత్తం 72,452 మట్టి నమూనాలు అధికారులకు అందజేశారు. డెల్టా ప్రాంతంలోని భీమవరం, నరసాపురం, ఆకివీడు వ్యవసాయ సబ్‌ డివిజన్స్‌ పరిధిలో సుమారు 6,921 మంది రైతుల నుంచి శాంపిల్స్‌ సేకరించారు. డెల్టాప్రాంతంలో 6.25 ఎకరాలు, మెట్టప్రాంతంలో 10 ఎకరాల పరి ధిలోని భూమికి ఒక శాంపిల్‌ చొప్పున సేకరించారు. భీమవరం డివిజన్‌లో 2,656 శాంపిల్స్, నరసాపురం డివిజన్‌ పరిధిలో 1,653 శాంపిల్స్, ఆకివీడు డివిజన్‌లో 2,602 శాంపిల్స్, పాలకొల్లు విడిజన్‌ పరి ధిలో 2,200 శాంపిల్స్‌ వ్యవసాయశాఖ సేకరించింది. గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌ (జీఎస్‌పీ) ద్వారా శాంపిల్స్‌ నమోదు చేశారు.
తాడేపల్లిగూడెం, భీమవరంలో పరీక్షలు
గతంలో భూసార పరీక్షలు కేవలం తాడేపల్లిగూడెంలో మాత్రమే నిర్వహించగా ప్రస్తుతం పెద్ద మొత్తంలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో భీమవరం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కూడా భూసార పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ నేలరంగు, స్వభావం, ఉదజని సూచిక, లవణ చూసిక వంటి వాటిని గుర్తించి పొటాష్, భాస్పరం వంటి వాటిని ఏ మోతాదులో వాడాలో తెలియచేస్తారు. ఇవి గాకుండా తాడేపల్లిగూడెం భూసార పరీక్షాకేంద్రం పరీక్షలు నిర్వహించి నత్రజని, సూక్ష్మపోషకాలు వంటి వాడకాన్ని తెలియచేస్తారు. భీమవరం వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిధిలో 2,656 శాంపిల్స్‌ సేకరించగా ఇప్పటివరకు 219 శాంపిల్స్‌ çఫలితాలు మాత్రమే అధికారులకు అందాయి. 
భూసార పరీక్ష ఫలితాలతో లాభాలు ఇవీ.. భూసార పరీక్షల నివేదికలు అందింతే ఆ భూమిలో  ఏ పంట వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి? ఏ మేరకు యూరియా, భాస్పరం, డీఏపీ వంటి కాంప్లెక్స్‌ ఎరువులు, పొటాష్‌ను ఏ మేరకు ఎంత మోతాదులో వేసుకోవాలో రైతులకు తెలుస్తుంది. దీంతో ఆయా పంటలు వేసుకోవడంతో పాటు ఎరువులను అవసరమైనే మోతాదులోనే వేసుకోవచ్చు. దీంతో రైతులకు ఆర్థికంగా లాభంతో పాటు పంట దిగుబడులు పెరుగుతాయి. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement