
అవినీతి గోరంత ఖర్చు కొండంత
ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిని తేల్చేందుకు చేపట్టిన సామాజిక తనిఖీలు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తయారయ్యాయి.
– రూ.6,487 అవినీతి తేల్చడానికి రూ.1.73 లక్షల ఖర్చు
– అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు
గుత్తి రూరల్ : ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిని తేల్చేందుకు చేపట్టిన సామాజిక తనిఖీలు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తయారయ్యాయి. రూ.6.487 అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ బందం అధికారులు తేల్చారు. ఈ అవినీతిని తేల్చేందుకు అధికారులు చేసిన ఖర్చు చూస్తే దిమ్మ తిరుగుతుంది. ఈ అవినీతిని తేల్చడానికి ఎకంగా రూ.1.73 లక్షలు ఖర్చు చేశారు. గుత్తి మండలంలో 2015 నవంబర్ 31 నుంచి ఈ ఏడాది జూన్ 31 వరకు రూ.4.88 కోట్ల ఉపాధి నిధులతో పనులు చేపట్టారు.
ఈ నిధులు సక్రమంగా వినియోగించారా లేదా?అనే విషయంపై నిజాలను నిగ్గుతేల్చేందుకు ఈ నెల 14 నుంచి 19 వరకు గ్రామాల్లో సామాజిక తనిఖీ బందాలు తనిఖీలు చేశారు. మంగళవారం నిర్వహించిన ప్రజావేదికలో మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో రూ.6.487 అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ బందాలు వివరించాయి. ఈ అవినీతి అక్రమాలు గుర్తించేందుకు ఒక రాష్ట్ర రిసోర్సు పర్సన్, జిల్లా రిసోర్సు పర్సన్లు 14 మంది, ఎస్‌టీఎంలు 1, వీఎస్‌ఏలు 42 మంది పని చేశారు. వీరందరికి అయిన ఖర్చు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
వీరికిచ్చే వేతనం, ప్రయాణ భత్యం, పనులకు సంబంధించిన రికార్డుల జిరాక్స్‌లు, తనిఖీలు నిర్వహించిన అనంతరం జిల్లా డ్వామా అధికారులకు ఇవ్వాల్సిన నివేదికల జిరాక్స్‌ల కోసం మొత్తం రూ.1.73 లక్షలు ఖర్చు చేశారు. భారీగా అవినీతి జరిగినా టీడీపీ నేతల ఒత్తిళ్లలో సామాజిక తనిఖీ బందం తూతూమంత్రంగా తనిఖీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి తిరిగి తనిఖీలు సక్రమంగా జరిపించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు. కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారి ఈశ్వరయ్య, జిల్లా విజిలెన్స్ అధికారి చంద్రశేఖర్‌రావు, డీఆర్‌డీఏ టీఎంయూ ఈశ్వరయ్య, ఏపీడీ శైలకుమారి, ఎంపీడీఓ విజయప్రసాద్, ఏపీఓ రమేష్ పాల్గొన్నారు.