ప్రాణాలతో చెలగాటం
ప్రాణాలతో చెలగాటం
Published Sat, Jun 17 2017 1:51 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఏలూరు రూరల్ : అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కనీసం హెచ్చరిక బోర్డులు లేకుండా, బారికేడ్లు ఏర్పాటుచేయకుండా చేపట్టిన కల్వర్టు నిర్మాణం వాహనచోదకులకు ప్రాణసంకటంగా మారింది. ఏ లూరు మండలం మాదేపల్లిలో నీటిపారుదల శాఖ అధికారులు పోణంగి కాలువ పనులు చేపట్టారు. జాలిపూడి గ్రామానికి వెళ్లే ప్రధాన కూడలి వద్ద కైకలూరు రోడ్డు మధ్య నుంచి కాలువ తవ్వుతున్నారు. దీనిలో భాగంగా ప్రధాన రోడ్డుపై సుమారు 20 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల లోతులో గొయ్యి తవ్వారు. గొయ్యి లోపల కాలువ నిర్మాణం కోసం ఇనుప ఊచలతో కూడిన సిమెంట్ రివిట్‌మెంట్ పనులు చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఈ పనులు సాగుతున్నాయి. అయితే ఇక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనచోదకులు ప్రమాదాల బారిన
పడుతున్నారు.
యువకుడు బలి
ఏలూరు మండలం సత్రంపాడు గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ జుజ్జువరపు ఉదయరాజు (25), మరో యువకుడు గురువారం రాత్రి సమయంలో కైకలూరు నుంచి బైక్‌పై ఏలూరు వస్తుండగా చీకట్లో కాలువను గుర్తించలేకపోయారు. నేరుగా కాలువలో పడి ఇనుప చువ్వలు గుచ్చుకోవడంతో పాటు సిమెంట్ దిమ్మె తలకు బలంగా తగలడంతో ఉదయరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో కాంట్రాక్టర్ రాత్రికి రాత్రే రెండు తారుడబ్బాలను రోడ్డుకు అడ్డం పెట్టి చేతులు దులుపుకున్నాడు. కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
హెచ్చరిక బోర్డులు ఏవి
ప్రధాన రోడ్డుపై పనులు చేస్తున్నా కాం ట్రాక్టర్ లేదా అధికారులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టలేదు. కనీసం దారి మళ్లింపు తెలిపే సూచిక బోర్డునైనా ఏర్పాటుచేయలేదు. రోడ్డుపై తవ్విన గొయ్యికి ఇరుపక్కల బారికేడ్లు అడ్డుపెట్ట లేదు. రాత్రి వేళల్లో వాహనచోదకులు గొయ్యి గుర్తించే విధంగా చిన్నపాటి విద్యుత్ బల్బు లేదా రేడియం స్టిక్కర్లు ఏర్పాటుచేయలేదు. కనీసం కాలువ కోసం తవ్విన మట్టిని సైతం అడ్డుగా పోయలేదు. ఈ విషయాల్లో కాంట్రాక్టర్, అధికారులు నిండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనచోదకులు, ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.
ఘోరమైన నిర్లక్ష్యం
ఇంత నిర్లక్ష్యం ఎక్కడా లేదు. ప్రధాన రోడ్డుపై పనులు చేపట్టినా సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదు. రాత్రిళ్లు గుర్తించేలా ఫ్లడ్ లైట్ లేదా రేడియం స్టిక్కర్లతో కూడిన బారికేడ్లు ఏర్పాటుచేయలేదు.
– నాగేంద్ర, వెంకటాపురం
కేసు నమోదు చేయాలి
కాలువ పనుల వల్ల నిండు ప్రాణం పో యింది. దీనికి ఎవరు సమాధానం చెబుతారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై పోలీసు కేసు పెట్టాలి. అప్పుడే మరో అధికారి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించరు.
– కె.శ్రీనివాస్, ఏలూరు
Advertisement