దైవ ప్రార్థన చాలా అవసరం
రేపల్లె: యువతతో సమాజాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడమే వైఎంసీఏ ధ్యేయమని వైఎంసీఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లెబి ఫిలిప్ మాథ్యూ పేర్కొన్నారు. పట్టణంలోని ఇండియా రూరల్ ఇవాంజిలికల్ చర్చిలో గురువారం నిర్వహించిన కృతజ్ఞతా ప్రార్థన కూడికలో ఆయన మాట్లాడారు. ‘నిన్ను వలె నీరు పొరుగు వారిని ప్రేమించు’ అని క్రీస్తు చెప్పిన మార్గాన్ని యువత ఎంచుకోవాలని సూచించారు. సేవా కార్యక్రమాలతో పాటు దైవప్రార్థనకు కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పారు. వైఎంసీఏ సౌత్, ఈస్ట్ రీజియన్ చైర్మన్, ఐఆర్‌ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానియులు రెబ్బా మాట్లాడుతూ ప్రేమ, కరుణ, దయ గుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఏసు ప్రభువు కొలువుతీరి ఉంటాడరన్నారు. జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ లెబి ఫిలిప్ మాధ్యూ, సీహెచ్‌ఆర్‌పీ మణికుమార్‌ను ఇమ్మానియేలు రెబ్బా దంపతులు పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. వైఎంసీఏ జాతీయ కార్యదర్శి సీహెచ్‌ఆర్పీ మణికుమార్, ఐఆర్‌ఈఎఫ్ పరిపాలనాధికారి దీవెన రెబ్బా, రెబ్బా జాన్‌పాల్(చంటి), ప్రిన్సిపాల్స్ జడ్.రత్నప్రసాద్, హానోక్ తదితరులు పాల్గొన్నారు.