జిల్లా సిగలో ప్రతిష్టాత్మక సంస్థ
∙ ఫార్మా కోపియా కమిషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
∙ ముచ్చింతల్‌లో స్థల పరిశీలన..
∙ రూ.200 కోట్లు కేటాయింపు
∙ రాష్ట్ర ప్రభుత్వం లేఖతో అనుమతి ఇచ్చిన కేంద్రం
∙ దేశంలోనే తొలి అకాడమీ ఇది
∙ ఔషధరంగ సంస్థ అభివృద్ధికి ఉపయోగం
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువుదీరనుంది. జాతీయ ఫార్మా కోపియా కమిషన్ ప్రాంతీయ కార్యాలయం జిల్లాలో ఏర్పడనుంది. ఔషధరంగ అభివృద్ధికి ఈ సంస్థ అవసరమని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్ర సర్కారు సానుకూలంగా స్పందించింది. ‘జాతీయ డ్రగ్స్ కంట్రోల్ అకాడమీ, జాతీయ ఫార్మా కోపియా కమిషన్ రెండో కార్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు సంస్థల స్థాపనకు రూ.200 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించిన కేంద్రం... తక్షణమే భూములను కేటాయించాలని కోరింది. జాతీయ డ్రగ్స్ కంట్రోల్ అకాడమీ మందుల నియంత్రణ విధానాలు, ప్రమాణాలు, సంస్కరణలపై అధ్యయనం చేయడమేగాకుండా.. బోధనలు పర్యవేక్షిస్తోంది. దేశంలోనే తొలి అకాడమీ ఇదే.
ఈ రంగంలో కోర్సుల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. ఫార్మా కోపియా కమిషన్ (ఐపీ) ప్రధాన విధి మందుల గుర్తింపు, తయారీ, ప్రభావం, ప్రమాణాలు, మోతాదు, నిల్వ తదితర అంశాలపై నిరంతరం మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఈ సంస్థ నిబంధనల ప్రకారమే మందులను తయారు చేయాల్సి ఉంటుంది. జీవరాశికి సంబంధించిన ప్రతి మందు ఐపీ పొందుపరిచిన నియామవళికి అనుగుణంగానే ఉత్పత్తి జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫార్మారంగంలో కీలక భూమిక పోషించే ఐపీ సంస్థను ముచ్చింతల్‌లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. జిల్లాలో సుమారు 19వేల ఎకరాల విస్తీర్ణంలో ఔషధనగరిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలకు జిల్లాకు తరలిరావడం ఫార్మా రంగానికి మరింత ఊపునిస్తోంది. ఐపీ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్పత్తయ్యే మందుల తయారీ నాణ్యతా ప్రమాణాలను కూడా పరిశీలించనుంది.