ప్రైవేట్ ట్రావెల్స్ దందా
– జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాల బస్సుల రాకపోకలు
– రవాణా శాఖ ఖజానాకు భారీ నష్టం
అనంతపురం సెంట్రల్: అనుమతులు పొందేది ఒక చోట. రాకపోకలు సాగిస్తున్నది మరోచోట. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులూ చెల్లించకుండానే మనరోడ్లపై రయ్యి.. రయ్యి మంటూ ఇతర రాష్ట్రాల ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు దూసుకుపోతున్నాయి. దీని వలన ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడుతోంది. రాష్ట్ర స్థాయిలో తీవ్ర దుమారం రేగడంతో ఇలాంటి బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో పెనుకొండ చెక్‌పోస్టులో రెండు, గుత్తి టోల్‌గేట్ వద్ద ఒకటి, అనంతపురం జాతీయ రహదారిలో ఒక బస్సును సీజ్ చేశారు. ఇటు బెంగళూరు, అటు హైదరాబాద్, విజయవాడకు వెళ్లాలంటే అనంతపురం మీదుగా రాకపోకలు సాగాలి. ఈ నేపథ్యంలో అనుమతి లేని వాహనాలకు కళ్లెం వేసేందుకు దాడులు ముమ్మరం చేయాలని రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు.
ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు
ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఎక్కువశాతం కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఎలాంటి పన్నులు లేకుండా ట్రావెల్స్ నడుపుతున్నారు. రాష్ట్రాలు దాటి ప్రయాణికులను ఎక్కించుకుని గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. మధ్యలో కొన్ని రాష్ట్రాలకు అనుమతి పొందకుండానే నడుపుతున్నారు. దీని వలన ప్రభుత్వ ఖజనాకు పన్నుల రూపంలో నష్టం వాటిల్లితే... ప్రయాణికులను చేరవస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ, పన్నులు చెల్లిస్తున్న మన ట్రావెల్స్ యాజమాన్యాలకు నష్టం చేకూరుతోంది. కొన్నేళ్ల నుంచి ఇతర రాష్ట్రాల ప్రైవేట్ ట్రావెల్స్‌ల దందా కొనసాగుతోంది.
సీజ్ చేయడానికి అధికారుల్లో భయం
ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అధికారుల్లో మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇచ్చినా.. వాటిపై జరిమానాలు విధించి విడుదల చేసే అధికారాలు జిల్లాస్థాయి అధికారులకు లేవు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంతమంది ఇతర రాష్ట్రాల ట్రావెల్స్ నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బస్సుల జోలికి రావొద్దని అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి.
దాడులు చేస్తున్నాం
నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్నా ఇతర రాష్ట్రాల బస్సులను సీజ్ చేయాలని ఆదేశాలు అందాయి. దీంతో దాడులు చేస్తున్నాం. ముఖ్యమైన రహదారుల్లో వాహన తనిఖీలు చేపడుతున్నాం. ఇప్పటి వరకూ నాలుగు బస్సులు సీజ్ చేశాం.
- శ్రీధర్, ఆర్టీఏ, అనంతపురం