Published
Fri, Aug 5 2016 12:04 AM
| Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
హామీలను విస్మరించిన ప్రభుత్వం
అర్వపల్లి : ఎన్నికల సమయంలో దళితులకు టీఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని బీజేపీ దళితమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గోలి ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూమిలేని దళితులకు ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాలు ఉచితంగా ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ రెండేళ్ల కాలంలో కేవలం 3వేల కుటుంబాలకు మాత్రమే భూమి పంపిణీ చేశారని చెప్పారు. రాష్ట్రంలో భూమిలేని దళితులు 2.91లక్షల కుటుంబాలు ఉన్నారని, అలాగే ఎకరంకన్న తక్కువ ఉన్న కుటుంబాలు 1.48లక్షల కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య వాగ్ధానాలు ఎప్పటికీ తీరవన్నారు. దళితులకు చేసిన హామీలను ప్రభుత్వం నెరవేర్చక పోతే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎ.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.