– ‘కేవీఆర్’ ప్రహరీ కోసం పోరాడినందుకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
– జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణకు ఎంపీ బుట్టా, హఫీజ్‌ఖాన్ వినతి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : జిల్లావ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ గుండాల నుంచి రక్షణ కల్పించాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణకు విన్నవించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎస్పీని కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జీ హాఫీజ్‌ఖాన్‌తో కలసి బెదిరింపు కాల్స్ వివరాలు, తాజాగా అశోక్‌పై జరిగిన దాడిని వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కర్నూలులోని కేవీఆర్ కళాశాల ఆట స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పట్టుబడితే హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలతో కలసి పోరాటం చేశారన్నారు.
దాదాపు 2500 మంది బాలికలు చదువుకునే కళాశాల ఆటస్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మునిసిపల్ కమిషనర్ హరినాథరెడ్డి అక్కడ ఎలాంటి నిర్మాణాలను చేపట్టడం లేదని, హ్రహరీని నిర్మించి బాలికలకు రక్షణ కల్పిస్తామని తనకు హామీ ఇచ్చారన్నారు. దీన్ని సహించలేని టీడీపీ నాయకులు దీన్ని ఓర్చుకోలేకపోతున్నారన్నారు. ఎలాగైనా అక్కడ షాపింగ్ కాంప్లెక్ కట్టి లక్షలాది రూపాయలను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ‘కేవీఆర్’ వ్యవహారాన్ని ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో పోస్ట్ చేసిన అశోక్ అనే కార్యకర్తపై ఎమ్మెల్యే అనుచరుడు షరీఫ్ ప్రోద్భదలంతో చిన్నా, అతని స్నేహితులు నగరంలోని ఎన్‌ఆర్‌పేటలో దాడి చేశారన్నారు.
బెదిరింపు కాళ్లపై చర్యలేవి?
గతంలోనూ హాఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డితోపాటు అనేక మందికి టీడీపీ నాయకుల నుంచి బెదిరింపుకాల్స్ వచ్చాయని ఎంపీ తెలిపారు. ఇప్పటి వరకు వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అనంతరం హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ..ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. తమ సహనాన్నిచేతగాని తనం అనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే తమ పార్టీ కార్యకర్త అశోక్‌పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ బుట్టారేణుక వినతిపై ఎస్పీ స్పందించి జరిగిన సంఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ రమణమూర్తిని ఆదేశించారు. నాయకులు సురేందర్‌రెడ్డి, నాగరాజుయాదవ్, ఎస్‌కే రహమాన్, అనిల్‌కుమార్, సఫీయాఖాతూన్, వాహిదా, గౌసియా, జాన్ పాల్గొన్నారు.
నారాయణరెడ్డి కుటుంబానికి భద్రతను కల్పించాలి
– ఎస్పీని కలిసిన కుటుంబ సభ్యులు, ఎంపీ బుట్టా
వైఎస్‌ఆర్ సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి కుటుంబానికి భద్రతను కల్పించాలని ఎంపీ బుట్టా రేణుక జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణను కోరారు. ఈ మేరకు మంగళవారం ఎంపీతోపాటు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి, అన్న ప్రదీప్‌రెడ్డితో కలసి ఎస్పీని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..అధికార పార్టీ నాయకులు నారాయణరెడ్డి శత్రువులకు అభయహస్తం ఇచ్చి చెరుకులపాడులో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా తెలుగుదేశం పెద్దలు స్వచ్ఛంద ఫ్యాక‌్షన్‌ను ప్రోత్సహిస్తున్నారన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నారాయణరెడ్డి కుటుంబీల నుంచి ప్రాణహాని ఉందని గ్రామస్తులతో చెప్పించడమే ఇందుకు నిదర్శనమన్నారు.
నారాయణరెడ్డి భార్య శ్రీదేవి, అన్న ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో, ఆ తర్వాత కూడా(పదేళ్లు) తమ గ్రామంలో చిన్నాపాటి ఘర్షణ కూడా జరగలేదని, అయితే టీడీపీ అధికారంలోకి రాగానే ఏకంగా నారాయణరెడ్డినే హత్య చేశారన్నారు. చెరుకులపాడులో ఉంటే తమను చంపేస్తారేమోనన్న భయం వేస్తోందన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. పోలీసులు టీడీపీ వారికే అనుకూలంగా వ్యవహరించి తమ భద్రతను గాలికొదిలేశారని ఆరోపించారు. స్థానిక పోలీసులు తమను పట్టించుకోవడంలేదన్నారు. తమకు పోలీసుల రక్షణ కల్పించాలని, లేదంటే తమ ప్రాణాలకు భద్రత ఉండదని వారు ఆవేదనతో ఎస్పీకి విన్నవించారు.