వేరుశనగ రైతుల ఆందోళన
వేరుశనగ రైతుల ఆందోళన
Published Fri, Sep 23 2016 10:06 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
సూర్యాపేట :
ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగ పంటకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో మద్దతు ధర అందని ద్రాక్షగా మారింది. నియోజకవర్గంలోని పలు మండలాలతో పాటు నూతనకల్, మునగాల, తుంగతుర్తి ప్రాంతాలకు చెందిన రైతులు రెండు రోజుల క్రితం వ్యవసాయ మార్కెట్‌కు వేరుశనగ కాయను విక్రయించేందుకు తెచ్చారు. రైతులకు వ్యవసాయ మార్కెట్‌లో తక్కువ ధరకు కోట్ చేస్తున్నారు. క్వింటా వేరు శనగకాయను రూ. 1100లకు మార్కెట్ ఖరీదుదారులు ఖరీదు చేస్తున్నారు. ఇంత తక్కువ ధరకు ఖరీదు చేయడంతో పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రైతులు వారు తెచ్చిన వేరుశనగ వద్ద ఆందోళనకు దిగారు. మార్కెట్‌లో వేరుశనగ కాయను కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ అధికారులు మాత్రం మద్దతు ధర ఇవ్వకుండా మాయచేస్తున్నారని మండిపడ్డారు. వేరుశనగ వర్షానికి తడిసిందనే సాకుతో పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శని, ఆదివారం సెలవు దినంగా ప్రకటించడంతో తాము తెచ్చిన వేరు శనగకాయను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మద్దతు ధర ప్రకటించడం లేదు
– అయోధ్యరాములు, గట్టికల్, రైతు
వేరు శనగకాయకు మద్దతు ధర ఇవ్వడం లేదు. రెండు రోజుల క్రితం పంటను మార్కెట్‌కు తీసుకొచ్చాను. వర్షం వస్తున్నా మార్కెట్‌లోనే తలదాచుకుంటున్నాను. అయినా మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఖరీదుదారులు వారి ఇష్టానుసారంగా ధరలు పెడతామంటున్నారు.
పెట్టుబడులు వెళ్లేటట్టు లేదు
– గుగులోత్ జామిరి, కందగంట్లతండా, మహిళా రైతు
వేరుశనగ పంటకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. ఎంతో ఆశతో మద్దతు ధర వస్తుందని ఎదురు చూశా. కానీ సూర్యాపేట మార్కెట్‌లో వేరు శనగ కాయ విక్రయిద్దామని వస్తే మద్దతు ధర పెట్టడం లేదు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదు. వేరు శనగ కాయ తీసుకొచ్చి మూడు రోజులు అవుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
రైతులు ఆరబెట్టిన కాయను తీసుకురావాలి
– వెంకటేశం, మార్కెట్ సెక్రటరీ, సూర్యాపేట.
మార్కెట్‌కు వేరుశనగకాయను తీసుకువచ్చే రైతులు ఆరబెట్టి తీసుకురావాలి. వేరుశనగ కాయ తడిసి ఉన్నట్లైతే మద్దతు ధర రాదు. భారీ వర్షాల సూచనతోనే మార్కెట్‌కు శనివారం సెలవు ప్రకటించాం. రైతులు ఎవరూ ఎలాంటి ధాన్యాన్ని తీసుకురావద్దు.
Advertisement