అరెస్టులు.. అక్రమ నిర్బంధాలు
‘హోదా’పోరును అణచివేసేందుకు సర్కార్ కుట్రలు
జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, ర్యాలీలు
సాక్షి నెట్‌వర్క్: ప్రజల ఆకాంక్షలకు పాతరేస్తూ.. ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని అణగదొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం నిరసన కార్యక్రమాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతోపాటు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రాంతాలకు తరలించారు. కీలక నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. నిరసన కార్యక్రమాలు చేపట్టిన వారిపై దౌర్జన్యం చేశారు. రోడ్లపై కనిపిస్తే చాలు.. దొరికిన వారిని దొరికినట్లే లాఠీలతో చావబాదారు. సర్కారు కర్కశత్వానికి జనం అదరలేదు, బెదరలేదు. రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తి నినదించారు. అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో ర్యాలీలు చేపట్టారు. వేలాది మంది కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంధ పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తమ హోదా ఆకాంక్షను గౌరవించాలని ఎలుగెత్తి చాటారు.
ఇళ్లల్లో వెలిగిన కొవ్వొత్తులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేకహోదా ఉద్యమాన్ని చిదిమేయడానికి రాష్ట్రప్రభుత్వం అంతులేని నిర్బంధాన్ని ప్రయోగించినా ప్రజలు తమ ఆకాంక్షను స్పష్టంగా వెల్లడించారు. నాయకులను గృహనిర్బంధాలతో అడ్డుకున్నా, జనం రోడ్లపైకి రానివ్వకుండా అటకాయించినా సాయంత్రం కల్లా ఇళ్లలోనే కొవ్వొత్తులు వెలిగాయి. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రత్యేక హోదాను, ఉద్యమకారులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డరు.
హోదా కోసం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నిరసన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్‌లో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద నిరసన తెలిపారు. ప్యాకేజీ కాదు.. హోదా కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు ఉద్యమం చేస్తున్నా వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు.