కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
– వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్
కర్నూలు (న్యూసిటీ): కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదురుగా ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.ముందుగా రాజ్‌విహార్ నుంచి బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ చేశారు. వీరికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నో హామీలు ఇచ్చారని.. ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంఏ నవీన్‌కుమార్ మాట్లాడుతూ...తాము 16 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా ఎటువంటి భద్రత లేదన్నారు. డిసెంబరు 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య, జొహరాపురం నాయకులు హరికృష్ణ, సురేష్, ఏపీఎన్‌జీఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జవహర్‌బాబు, నాయకుడు సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వజూనియర్ కళాశాల (టౌన్ మోడల్) ప్రిన్సిపల్ చెన్నయ్య, కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమ సంఘం నాయకులు పి.రంగస్వామి, జి.నాగమల్లేషుడు, సునీత, సుభద్ర, కాంతమ్మ, వరలక్ష్మి, గిరిజారాణి తదితరులు పాల్గొన్నారు.