సమావేశంలో మాట్లాడుతున్న కడియం శ్రీహరి
- ఉప ముఖ్యమంత్రి శ్రీహరి
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులే బతికించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. గురుదేవోభవ కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం మమత ఆస్పత్రి ఆడిటోరియంలో ఉపాధ్యాయులకు మోటివేషన్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఫౌండేషన్ సాయంతో డిజిటల్ తరగతుల సెట్‌లను ఉపాధ్యాయులకు అందించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇప్పుడు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అనేకమంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో అంకితభావం కొరవడిందిని, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు రోజు రోజుకూ నమ్మకం పోతోందని, అందుకే అప్పులు చేసి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకన్నా ప్రైవేట్ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందనేది భ్రమ మాత్రమేనని అన్నారు. ప్రధానోపాధ్యాయులు సక్రమంగా పనిచేస్తే పాఠశాలల పరిస్థితులు చక్కబడుతాయన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి, ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతోపాటు ఉపాధ్యాయులు సక్రమంగా రాకపోవడం.. వచ్చినా కూడా సక్రమంగా చెప్పకపోవడం కారణాలన్న విషయం సుప్రీంకోర్టు సర్వేలో తేలిందని అన్నారు. ‘‘మౌలిక సవతుల కల్పనకు ఎంత డబ్బయినా ఖర్చు చేసే బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది’’ అని అన్నారు. ప్రజల కోరిక మేరకు రాష్ట్రంలోని ఐదువేల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినట్టు, కేజీ టు పీజీలో భాగంగా 320 కొత్త గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నదన్నారు. ఏకీకత సర్వీస్ రూల్స్ త్వరలో ప్రకటిస్తామని; భాషాపండితులు, పీఈటీల సమస్యలు కూడా త్వరగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొందరు ఉపాధ్యాయులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ మురళి, ఆర్‌జేడీ బాలయ్య, డీఈఓ నాంపల్లి రాజేష్, ఎన్‌ఆర్‌ఐ పౌండేషన్ బాధ్యులు తాళ్లూరి జై, ఆళ్ల రాధాకష్ణ, పంచాక్షరయ్య, గుర్రం కిషన్‌రావు, కొంగర పురుషోత్తం, దండ్యాల లక్ష్మణ్‌రావు, నరేంద్ర స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.