పుష్కరాల్లో పురోహితులు
పుష్కరాల్లో పురోహితులు
Published Mon, Aug 22 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
భక్తితో నదిలో మునిగితే పాపం హరించుకుపోతుందన్నది భక్తుల విశ్వాసం. పుష్కరుడు ఉన్న నదిలో స్నానం చేస్తే పాపం హరించడంతో పాటు పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. పుష్కర స్నానానికి వచ్చినవారు నదిలో వివిధ రకాల కర్మలు, విధులు ఆచరిస్తుంటారు. సంకల్పం చెప్పుకోవడం నుంచి పితృదేవతలకు పిండ ప్రదానాల వరకు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి పురోహితులు తప్పనిసరి. ఆలయాల్లోని అర్చకులతో పాటు భక్తుల సౌకర్యార్థం పుష్కరఘాట్ల వద్ద ప్రత్యేకంగా పురోహితులను అందుబాటులో ఉంచారు. పుష్కర విధుల్లో ఉన్న పూజారులు మనోగతం వారి మాటల్లో..
– పుష్కరఘాట్ల నుంచి ‘సాక్షి’ బృందం
భక్తులకు అవగాహన పెరిగింది
– గురురాజాచార్యులు, భక్తాంజనేయస్వామి ఆలయ అర్చకుడు, రంగాపూర్
గతంలో పుష్కరస్నానాలపై భక్తులకు అవగాహన లేకపోవడంతో గ్రామాల నుంచి బయటికి వచ్చి పుష్కరస్నానాలు చేయలేదు. ప్రస్తుతం పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రభుత్వ ప్రచారంతో పుష్కరస్నానంపై అవగాహన వచ్చింది. రంగాపూర్ పుష్కరఘాట్ వద్ద కొన్ని లక్షల మంది భక్తులు పుణ్యస్నానం చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉంది.
పూజలు చేయడం అదృష్టం
రంగాపూర్ ఘాట్ సమీపంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామి దేవాలయంలో రెండోసారి అశేష భక్తుల కోసం పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నా. రోజుకు 50వేల మంది భక్తులతో పూజలు చేయిస్తున్నాను. స్వరాష్ట్రంలో జరుగుతున్న తొలి కృష్ణా పుష్కరాలకు భక్తుల ఊహించని విధంగా వస్తున్నారు. నవగ్రహ పూజలు, పంచామృతం, హారతులు, అభిషేకాలు చేస్తూ ఆశీర్వదిస్తున్నాను.
– ఎం. గురురాజాచారి, పూజారి, పెబ్బేరు
కొత్త అనుభూతి..
కృష్ణా పుష్కరాల సమయంలో మేము దేవాలయంలో భక్తులతో పూజలు చేయించే అవకాశం రావడం మా అదృష్టం. ఇంత మంది భక్తులు కృష్ణా పుష్కరాలకు వచ్చి పుణ్య స్నానాలు చేయడం మరిచిపోలేము. కొత్త అనుభూతిని ఇస్తుంది.
–మారుతీశర్మ, బీచుపల్లి
పూజలతో సంతృప్తి ..
భక్తుల రద్దీ బాగా పెరుగుతుంది. పవిత్ర కృష్ణా పుష్కరాల్లో స్నానం ఆచరించేందుకు వస్తున్న భక్తులు వారి పెద్దల ఆత్మశాంతి కోసం వందల సంఖ్యలో పిండ ప్రదానాలు చేస్తున్నారు. కనీవినీ ఎరగని రీతిలో భక్తులు వస్తుండటంతో వారిచే పూజలు చేయించడం సంతృప్తినిస్తుంది.
– శేషాచార్యులు, ప్రధాన అర్చకుడు, ఆత్మకూర్
ఎంతో ఆనందం..
కృష్ణా పుష్కరాల సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ పుణ్యస్నానాలు చేసేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మూలమల్ల ఘాట్‌లో 60మందికిపైగా పూజారులు పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు పుష్కరాల విశిష్టత గురించి చెబుతూ పూజలు చేస్తుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
– రాఘవేందర్‌రావు, ఆత్మకూర్
Advertisement
Advertisement