పుష్కర పనులు ఎక్కడివక్కడే
Published Sat, Aug 6 2016 8:51 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
విజయవాడ సెంట్రల్ :
టీడీపీ పాలకులు నగరంలో అభివృద్ధి ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల విమర్శించారు. శనివారం పార్టీ కార్పొరేటర్లతో కల్సి చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఆలయాల కూల్చివేత, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించిన పాలకులు చివరకు మహాత్మాగాంధీ విగ్రహాన్ని బుడమేరులో పడేయడం శోచనీయమన్నారు. మంచిపనులు చేసేవాళ్ళు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిల్చిపోతారన్న ఎంపీ కేశినేని వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంచిపనులు చేశారు కాబట్టే ఆయనకు పేదలు గుండెల్లో గుడి కట్టారన్నారు. పుష్కర పనుల్ని పూర్తి చేయడంలో అధికారులు, పాలకులు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఐదు నెలల క్రితం పుష్కర పనులు ప్రారంభమైతే ఎంపీకి కార్పొరేటర్లు ఇప్పుడు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. 30 శాతం పనులు అలాగే మిగిలిపోయాయని నాలుగు రోజుల్లో వీటిని ఎలా పూర్తి చేస్తారని ధ్వజమెత్తారు.
పారిశుద్ధ్యంపై ఇప్పుడు అసహనమా?
శానిటేషన్ కాంట్రాక్టులు అడ్డదారిలో పచ్చదండుకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పుడు పారిశుధ్యం బాగోలేదని సీఎం అసహనం వ్యక్తం చేయడం ఓ డ్రామాగా పేర్కొన్నారు. గోడలపై బొమ్మలు వేస్తే విజయవాడ మారిపోదని, పేద,మధ్య తరగతి వర్గాలకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు బీజాన్‌బీ, అవుతు శ్రీశైలజ మాట్లాడుతూ హడావుడి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. దాసరి మల్లీశ్వరీ మాట్లాడుతూ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించిన ఎంపీ కార్పొరేటర్లను అవమానపర్చారన్నారు. 4వ డివిజన్లో పదిరోజులుగా మురుగునీరు వస్తోందని ఆ విషయాన్ని చెబుదామంటే కనీసం తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. పార్టీ కార్పొరేటర్లు బి.సంధ్యారాణి, ఉమ్మడిశెట్టి బహుదూర్, కె.దామోదర్, ఎం.శివశంకర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement