పులివెందుల : పదవులు, ప్రమోషన్ల కోసమే టీడీపీ నాయకులు వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని పులివెందుల వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పులివెందుల అభివృద్ధి గురించి టీడీపీ నేతలు ర్యాలీలు, బహిరంగ సభలు పెట్టడం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందన్నారు. అభివృద్ధి అంటేనే వైఎస్ అని రాష్ట్ర ప్రజలందరికి తెలుసన్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి కోసం, వైద్య, విద్యాలయాల కోసం కృషి చేసింది వైఎస్ కుటుంబం మాత్రమేనన్నారు.
చిత్రావతి బ్యాలెన్సింగ్ ద్వారా 177 గ్రామాలకు తాగునీరు అందించే సమగ్ర మంచినీటి పథకం, వైఎస్ రాజారెడ్డి వైద్యశాల, డిగ్రీ, పాల్‌టెక్నిక్, ఐటీఐలతోపాటు వెంకటప్ప మోమోరియల్ స్కూలు ఏర్పాటు చేశారని.. లింగాల కుడికాలువ, పైడిపాలెం ప్రాజెక్టులతోపాటు జెఎన్‌టీయూ, పశుపరిశోధన సంస్థ, ట్రిపుల్ ఐటీ, ఎక్కడ చూసినా అద్భుతమైన రోడ్లు మహానేత వైఎస్‌ఆర్ హయాంలోనే వచ్చాయన్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో స్పిన్నింగ్ మిల్లులు, పులివెందుల, వేంపల్లె, ఇప్పట్ల ప్రాంతాలలో సిమెంటు బ్యాగులు తయారు చేసే ఫ్యాక్టరీలు వచ్చాయన్నారు.
గత 5 ఏళ్లలో తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ ఎంపీ నిధులతో గ్రామ, గ్రామాల్లో ఖర్చు చేసింది వైఎస్ కుటుంబమేనన్నారు. అలాగే ప్రతి ఏడాది వేసవి కాలంలో పులివెందుల పట్టణ ప్రజలకు 20 ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్న ఘనత వైఎస్ కుటుంబానికే దక్కుతుందన్నారు. వైఎస్‌ఆర్ తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ నాయకులను ఏకంచేసి వర్గ రాజకీయాలను రూపుమాపారని గుర్తుచేశారు. పట్టిసీమ గురించి శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సవివరంగా మాట్లాడారని, తాను ఈ పథకానికి వ్యతిరేకం కాదని అందులో లోపాలు సరి చేసుకోవాలని, దీనివల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకూడదని పేర్కొన్నార న్నారు.
ఈ విషయాలు టీడీపీ నేతలకు తెలియవా అంటూ ప్రశ్నించారు. సొంత నియోజకవర్గాల్లో ప్రజల మన్ననలు పొందలేని నాయకులు వైఎస్ కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రిపురం ఎంపీపీ సుభాషిణి, తొండూరు ఎంపీపీ, జడ్పీటీసీలు జయప్రద, లక్ష్మినారాయణమ్మ, లింగాల జడ్పీటీసీ అనసూయమ్మ, లింగాల ఎంపీపీ సుబ్బారెడ్డి, వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ సీనియర్ నాయకులు ఎర్రగంగిరెడ్డి, వేముల జడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, పులివెందుల మండల ఉపాధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర రైతు విభాగపు కార్యదర్శి అరవిందనాథరెడ్డి, వేంపల్లె మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, పులివెందుల మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప, రాష్ట్ర బీసీ కార్యదర్శి నారాయణస్వామి, లింగాల, తొండూరు మండలాల యూత్ కన్వీనర్లు మనోహర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రసూల్, రైతు విభాగపు కార్యదర్శి సర్వోత్తమరెడ్డి, చక్రాయపేట మండల నాయకులు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
పదవుల కోసమే వైఎస్ కుటుంబంపై ఆరోపణలు
Published Wed, Mar 25 2015 2:46 AM | Last Updated on Thu, Jul 26 2018 6:52 PM
Advertisement
Advertisement