ఆదివారం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పిస్తున్న వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతి, బ్రదర్ అనిల్‌కుమార్, మాజీ ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు (ఇన్‌సెట్‌లో) మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మ
సాక్షి కడప/వేంపల్లె: ‘‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుని దగ్గరున్నారు. ప్రజల కోసం చేయాల్సిన పనులన్నీ చేసి ఆయన దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కారణజన్ముడిగా మిగిలిపోయారు. అలాంటి పాలనను, పథకాలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే కొనసాగించగలరు. జగన్ ద్వారా వైఎస్సార్ పాలనను మళ్లీ తీసుకొద్దాం’’ అని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి ఆమె ఘనంగా నివాళులర్పించారు. విజయమ్మతో పాటు కోడలు భారతిరెడ్డి, కుమార్తె షర్మిల, వైఎస్ జగన్ కుమార్తె హర్ష, షర్మిల కుమార్తె అంజలి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్సార్ సోదరి విమలమ్మ, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అంజద్ బాషా, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, తదితరులు వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. వైఎస్సార్ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా విజయమ్మతో పాటు వైఎస్ భారతి రెడ్డి భావోద్వేగానికి గురై కన్నీటి పర్యాంతమయ్యారు. పాస్టర్ నరేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈరోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల మధ్య తిరుగుతున్నాడు. వైఎస్సార్ ఆశయాలను, సిద్ధాంతాలను జగన్ నిలబెడతాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజలందరికీ జగన్ ఎల్లవేళలా తోడుంటాడు’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘మీ అందరికీ ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక మనవడిగా నా బిడ్డ నిలబడతాడు. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం. అందుకోసం ప్రతి ఒక్కరూ జగన్‌కు అండగా నిలబడాలి’’ అని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment