ఇడుపులపాయలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందురోజే ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 9.10 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలసి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఎం సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిల, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ తదితరులు ఘాట్ వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా సమాధి ప్రాంగణం వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో వైఎస్సార్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సీఎం జగన్, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిల, పెద్దమ్మ వైఎస్ భారతమ్మలు ఒకింత భావోద్వేగానికి గురై చెమర్చిన కళ్లతో కనిపించారు. అక్కడికి సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి సీఎంతోపాటు కుటుంబ సభ్యులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. అల్పాహారం అనంతరం నేరుగా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ తనను కలిసేందుకు నిరీక్షిస్తున్న వారిని పలకరించారు. ఒక్కొక్కరితో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉదయం 10.15 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ఆయన 11.10 గంటల వరకు వినతులు స్వీకరిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు.
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న దివంగత సీఎం వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు
కార్యకర్త ‘సల్మా’కు ఫోన్‌లో పరామర్శ
అనారోగ్యంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేంపల్లెకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త సల్మాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. పార్టీ కార్యకర్త భారతి ద్వారా సల్మా అనారోగ్యం గురించి తెలుసుకున్న సీఎం జగన్ వెంటనే వీడియో కాల్ ద్వారా ఆమెతో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పార్టీ నేత అనిల్ కుమార్తెకు నామకరణం చేసిన సీఎం
లింగాల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు పెద్దమల్లు అనిల్‌కుమార్‌రెడ్డి, పెద్దమల్లు అనూషల కుమార్తెకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా జగతి అని నామకరణం జరిగింది. అనిల్‌కుమార్‌రెడ్డి దంపతులు ఇడుపులపాయలో ముఖ్యమంత్రిని కలిశారు.
పలువురు నివాళులు..
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు ఎస్‌బీ అంజాద్‌బాషా, నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, గురుమూర్తి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, జకియాఖానమ్, కత్తి నరసింహారెడ్డి, కల్పలత, గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆర్టీïసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పరిశ్రమలశాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, డీఐజీ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్ సీపీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు కె.సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, చక్రాయపేట ఇన్‌చార్జి వైఎస్ కొండారెడ్డి, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తదితరులు వైఎస్సార్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment