‘ప్రాణహిత’ డిజైన్ మారిస్తే ఊర్కోం!
♦ అది అంబేద్కర్ పేరిట పెట్టిన తెలంగాణ కలల ప్రాజెక్టు
♦ పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానా, భట్టి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ హయాంలో మేధావులైన ఇంజనీర్లతో డిజైన్ చేయించి.. సాంకేతిక లోపాలు లేకుండా రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్‌ను మారిస్తే ఊర్కోమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును విరమించుకోవడంతో పాటు నిజామాబాద్ జిల్లాలో 70 శాతం వరకు పూర్తయిన 20, 21, 22 ప్యాకేజీ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా బినోల నుంచి నవీపేట వరకు 14 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నవీపేటలో నిర్వహించిన సభలో ఉత్తమ్ మాట్లాడారు.
రాష్ర్టంలో జరిగిన రైతుల ఆత్మహత్యలకు టీఆర్‌ఎస్ సర్కారే బాధ్యత వహించాలని, ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్లే ఆత్మహత్యలు జరిగాయని జాతీయ నేరాల నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక సైతం తప్పుబట్టిం దని గుర్తు చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేసే వరకు ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. నాడు జాతీయ హోదా కావాలని పట్టుబడినవారు నేడు ఆ డిజైన్ బాగాలేదనడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.
రుణమాఫీ.. నవ్వులపాలు: భట్టి
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని నవ్వులపాలు చేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. 25 శాతం చొప్పున ఐదేళ్లపాటు ఇలా రుణమాఫీని సాగదీస్తే కేవలం వడ్డీ మాత్రమే మాఫీ అయి.. అసలు అలాగే మిగులుతుందని అంకెలతో సహా వివరించారు. రుణమాఫీ పత్రాలను రైతులకు ఇస్తున్నామని సంబంధిత శాఖమంత్రి ప్రకటించడం హాస్యాస్పదమ న్నారు. పత్రాలను అందిస్తామని బ్యాంకర్లతో చెప్పించాలని డిమాండ్ చేశారు.
కొత్త హామీలతో సర్కార్ మోసం: జానా
అమాయక ఓటర్లను మోస పూరిత హామీలతో ఆకట్టుకుని టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిం దని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత జానారెడ్డి విమర్శించారు.బోధన్‌లోని ఎన్‌ఎస్‌ఎఫ్‌ని ప్రభుత్వపరం చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, చెరకు రైతుల రూ.28 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియా, శాసనసభ కాంగ్రెస్ పక్ష ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్, మాజీ ఎంపీ మధుయాష్కీ, రాష్ట్ర యువజన కాంగ్రస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.