
మాట్లాడుతున్న జిల్లా జడ్జి విజయ్‌మోహన్
- జిల్లా ప్రధాన జడ్జి సీహెచ్.విజయ్‌మోహన్
ఖమ్మం లీగల్ : ఎంతో నమ్మకంతో న్యాయస్థానానికి వచ్చిన వారి కేసులను త్వరితగతిన పరిష్కరించినప్పుడే సమాజంలో వ్యవస్థపై గౌరవం పెరుగుతుందని జిల్లా ప్రధాన జడ్జి సీహెచ్ విజయ్‌మోహన్ అన్నారు. సెప్టెంబర్ 10న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను చర్చించే నిమిత్తం బుధవారం జిల్లా కోర్టులో సమావేశం నిర్వహించగా ఆయన ప్రసంగించారు. క్రిమినల్ కేసుల్లో తగిలిన గాయాలు మానకముందే తీర్పు వెలువడితే నిందితులకు భయం కలిగి బాధితులకు అభయం లభించినట్లు అవుతుందన్నారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో సెప్టెంబర్ 10న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోటారు ప్రమాద కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి డాక్టర్ రాధాకృష్ణ కృపాసాగర్, అదనపు ఎస్పీ సాయికృష్ణ, న్యాయవాద సంఘం అధ్యక్షుడు బండారుపల్లి గంగాధర్, ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ రామారావు మాట్లాడారు. న్యాయమూర్తులు వీఏఎల్ సత్యవతి, ఎం.వెంకటరమణ, మాధవీలత, అమరావతి, గీతారాణి, సతీష్‌కుమార్, ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.