
వర్షానికి దెబ్బతిన్న రైల్వే పనులు
కళ్యాణదుర్గం: పట్టణ సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద చేపట్టిన సీసీరోడ్డు, మట్టిరోడ్డు పనులు శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి దెబ్బతిన్నాయి. రెండేళ్లుగా కళ్యాణదుర్గం ప్రాంతంలో రైల్వే రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. భారీ వర్షానికి సీసీ రోడ్డుకిరువైపులా ఉన్న మట్టి కోతకు గురైంది. రింగ్‌రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ వరకు సీసీ రోడ్డు వేశారు.
ఇరువైపులా గరుసు మట్టి ఏర్పాటు చేశారు. సుమారు రూ.కోటితో రైల్వే స్టేషన్ భవనం, సీసీరోడ్డు, మట్టి రోడ్డు పనులు ఏడాది క్రితమే పూర్తి చేశారు. కళ్యాణదుర్గం నుంచి కంబదూరు వరకు జరుగుతున్న రైల్వే పనుల్లోనూ నాణ్యత లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై సంబంధిత ఇంజనీరు సాయిని వివరణ కోరగా భారీ వర్షంతో కోతకు గురైన పనులను పరిశీలిస్తామని తెలిపారు.