విచారణ నిర్వహిస్తున్న సీఐ కిరణ్‌కుమార్
-
బహిష్కరణ బాధ్యులపై బైండోవర్ కేసు నమోదు
నేలకొండపల్లి:మండలంలోని ఆరెగూడెంలో రజకుల బహిష్కరణపై కూసుమంచి సీఐ ఎం.కిరణ్‌కుమార్ గురువారం రాత్రి విచారణ ప్రారంభించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు ఇరు వర్గాలను, మండల స్థాయి అధికారులు, రజక సంఘం నాయకుల సమక్షంలో పిలిపించి విచారణ చేపట్టారు. ముత్యాలమ్మ పండగ రోజు జరిగిన వివాదంపై ఇరు వర్గాలను అడిగి వివరాలను తెలుసుకున్నారు. దీంతో ఇరువర్గాలు ఎవరి వాదనలు వారు వినిపించారు. బహిష్కరణ గురించి టమకా వేయించిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాల వాదన విన్న తరువాత శుక్రవారం గ్రామంలో రజకులను బహిష్కరించలేదని, రజకులు వారి పనులు చేసుకునేందుకు అందరి ఇళ్లలోకి రావచ్చని టమకా వేయించాలని సీఐ గ్రామ పెద్దలకు సూచించారు. అదేవిధంగా రజకులను బహిష్కరించిన వారిపై నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో బైండోవర్ కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో నేలకొండపల్లి ఎస్సై పి.దేవేందర్‌రావు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కొత్తకుండ్ల శ్రీలక్ష్మి, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.ఆశయ్య, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దోనపల్లి వెంకన్న, తెలంగాణ రజక సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పాగర్తి సుధాకర్, ఎంఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంమూర్తి, గురుమూర్తి, లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు భద్రునాయక్, ఆర్‌ఐ వసంత, సర్పంచ్ కొమ్మినేని కృష్ణయ్య, గ్రామ రెవెన్యూ అధికారి చైతన్యభారతి, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.