రాజమహేంద్రవరం నగరానికి రాజయోగం
రాజమహేంద్రవరం నగరానికి రాజయోగం
-
-
8 నాలుగింతలు పెరగనున్న విస్తీర్ణం
-
8 రేపు పాలకమండలి ముందుకు మాస్టర్ ప్లాన్
-
8 ఆమోదం లాంఛనప్రాయమే
-
8 13 పంచాయతీల విలీనంతో మారనున్న నగర రూపురేఖలు
సాక్షి, రాజమహేంద్రవరం :
పెరిగిన జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల లేమితో సతమతమవుతున్న రాజమహేంద్రవరం నగరానికి రాజయోగం పట్టనుంది. నాలుగు దశాబ్దాల తర్వాత నగరపాలక సంస్థలో నూతన మాస్టర్ ప్లాన్ అమలు కానుంది. 1975లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రస్తుతం అమలులో ఉంది. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాజమహేం ద్రవరం నగర జనాభాకు అనుగుణంగా నూతన మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నగరపాలక సంస్థ ముసాయిదాను రూపొందించింది. దీనిపై నగర ప్రజల అభిప్రాయాలు సేకరించి, సవరించిన ప్రణాళికను ప్రభుత్వానికి పంపింది. అప్పటి నుంచి నూతన ప్రణాళికకు ఎనిమిదేళ్లుగా ఎదురుచూపులు తప్పలేదు. తాజాగా ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ శుక్రవారం జరిగే నగరపాలక మండలి సమావేశం ముందుకు రానుంది. సభ్యుల ఆమోదం లాంఛనమే కావడంతో మాస్టర్ ప్లాన్ అమలులోకి రానుంది. 2031 నాటికి అభివృద్ధిని అంచనా వేస్తూ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌తో నగర రూపురేఖలు మారనున్నాయి.
నాలుగు రెట్లు పెరగనున్న విస్తీర్ణం
నూతన మాస్టర్ ప్లాన్ అమలులోకి వస్తే నగర పరిధి 162.83 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. 1975 మాస్టర్ ప్లాన్ ప్రకారం నగర విస్తీర్ణం 44.5 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం నగరం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను కలుపుతూ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. దీని ప్రకారం 111.33 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన రూరల్ నియోజకవర్గంలో ఉన్న 13 పంచాయతీలు నగరంలో విలీనం కానున్నాయి. కాతేరు, తొర్రేడు, కోలమూరు–కొంతమూరు, గాడాల, పాలచర్ల, లాలాచెరువు, దివాన్ చెరువు, పిడింగొయ్యి, హుకుంపేట, శాటిలైట్‌సిటీ–మోరంపూడి, బొమ్మూరు, ధవళేశ్వరం, మధురపూడి పంచాయతీలు నగరంలో కలవనున్నాయి. ఈ ప్రాంతాలు కలుస్తుండడంతో రాజమహేంద్రవరం నగర విస్తీర్ణం 44.5 చ.కి.మీటర్ల నుంచి 162.83 చ.కి.మీటర్ల మేర నాలుగు రెట్లు పెరగనుంది. జనాభా దాదాపు రెట్టింపు కానుంది. ప్రస్తుతం 3.41 లక్షలుగా ఉన్న జనాభా 13 పంచాయతీలు కలుస్తుండడంతో 5.92 లక్షలకు పెరగనుంది.
తీరనున్న సమస్యలు
పురాతన రాజమహేంద్రవరం నగరంలో బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థే ఇప్పటికీ ఆధారం. వ్యాపార, విద్య, ఉపాధి అవకాశాలు పెరగడంతో నగర జనాభా గత కొన్నేళ్లుగా బాగా పెరిగింది. 2011 లెక్కల ప్రకారం నగరంలో జనాభా 3.41 లక్షల మంది ఉన్నారు. ఇంతమందికి అనుగుణంగా డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. వర్షం వచ్చిందంటే డ్రైనేజీలు పొంగి రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఇరుకు రోడ్లతో మెయిన్‌బజారు, తాడితోట, శ్యామలా సెంటర్, దేవీచౌక్ తదితర ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది. గోదావరి చెంత ఉన్నా తాగునీటికి తిప్పలు తప్పడంలేదు. ఆవ చానల్, నల్లా చానల్ ద్వారా గోదావరిలోకి మురుగునీరు కలుస్తుండడంతో నది కలుషితమవుతోంది. మాస్టర్ ప్లాన్ అమలులోకి వస్తే ఈ సమస్యలకు చాలావరకు పరిష్కారం లభిస్తుంది.