
హంతకులెవరు?
– వీడని రిటైర్డ్ ఎంపీడీఓ రామసుబ్బమ్మ హత్య మిస్టరీ
– ఎనిమిది నెలలైనా ముందుకు సాగని దర్యాప్తు
అప్పట్లో తమ పరిధి కాదంటే తమది కాదని కేసు నమోదుకే తాత్సారం చేసిన పోలీసులు దర్యాప్తులోనూ స్తబ్దుగా ఉన్నారు. హతురాలి తరఫు నుంచి అడిగేవారు లేకపోవడంతో ఏమాత్రమూ కేసులో పురోగతి లేదు. కేసును మూసివేస్తారా.. లేక మిస్టరీని ఛేదించి హంతకులను పట్టుకుంటారా ? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఆ రోజు ఏం జరిగిందంటే..
రామసుబ్బమ్మ యాడికి ఎంపీడీఓగా పని చేస్తూ 2014లో రిటైర్డ్ అయ్యారు. ఆమెకు భర్త లేరు. కూతురు శైలజ వివాహం కావడంతో మెట్టినింటికి వెళ్లిపోయింది. రామసుబ్బమ్మకు అనంతపురం నగర శివారులోని విద్యారణ్యనగర్‌లో సొంతిల్లు ఉంది. ఒక పోర్షన్‌లోæ ఆమె ఉంటుండగా, మరో పోర్షన్ అద్దె కిచ్చారు. 2016 మార్చి 24న రాత్రి నుంచి రామసుబ్బమ్మ ఇంట్లో టీవీ బాగా సౌండుతో ఆన్‌లో ఉంది. మరుసటి రోజు ఉదయం పక్కపోర్షన్‌లో ఉన్న వారు మోటార్ ఆన్ చేసేందుకని రామసుబ్బమ్మ ఉంటున్న పోర్షన్ వెనుకవైపునకు వెళ్లారు. మోటార్ ఆన్‌చేసి కిటికీలోనుంచి ఇంట్లోకి తొంగిచూడగా...రామసుబ్బమ్మ విగతజీవిగా పడి ఉంది. వెంటనే మృతురాలి బంధువులకు సమాచారం తెలియజశారు. వారు వచ్చి లోపలికి వెళ్లి చూసి పోలీసులకు సమాచారం అందించారు. రామసుబ్బమ్మ నోరు, ముక్కు భాగాల్లో తీవ్ర రక్తస్రావమైంది. ముందు రోజు (24వ తేదీ) సాయంత్రమే హత్య జరిగి ఉందని పోలీసులు నిర్ధారించారు.
ఎవరి పని..?
రిటైర్డు ఎంపీడీఓ రామసుబ్బమ్మది ఎవరికీ హాని చేసే మనస్తత్వం కాదు. ఇంటికి ఎవరు వచ్చినా... గేటులో నుంచి వారిని చూసి తెలిసినవారైతేనే తలుపు తీస్తుంది. లేదంటే లోపలి నుంచే మాట్లాడి పంపుతుందని స్థానికులు చెబుతున్నారు. మరి ఆ రోజు ఇంట్లోకి ఎవరు వచ్చారు? ఈ హత్య తెలిసిన వారిపనేనా? లేక నిందితులెవరైనా చాకచక్యంగా లోపలికి ప్రవేశించారా? అన్నది తెలుసుకోలేకపోతున్నారు. మామూలుగా రెండు చైన్లు, చేతివేళ్లకు రెండు ఉంగరాలు, చెవులకు కమ్మలతో కనిపించేది. హత్య జరిగిన రోజు రామసుబ్బమ్మ మెడలో ఎలాంటి బంగారు నగలూ కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే నగల కోసమే ఈ ఘాతుకాని ఒడిగట్టి ఉండవచ్చునని పోలీసుల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది.
త్వరలోనే ఛేదిస్తాం
ఇటీవలే నేను ఎస్‌ఐగా బాధ్యతలు తీసుకున్నా. ఇప్పటి వరకూ శాంతిభద్రతలను గాడిలో పెట్టడంపై దృష్టి సారించాం. రిటైర్డ్ ఎంపీడీఓ రామసుబ్బమ్మ హత్య కేసును సవాల్‌గా తీసుకుంటున్నాం. త్వరలోనే ఈ కేసులో నిందితులను పట్టుకుంటాం. ఆమె బంధువులు, చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలు సహకరించకపోవడం వలనే దర్యాప్తు ఆలస్యమవుతోంది.
- శ్రీరామ్, ఎస్‌ఐ, నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్, అనంతపురం