ఇంటింటికీ నవరత్నాల ఫలాలు
► వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
► సీఎం ఒక్క హామీ నెరవేర్చిన దాఖలాలు లేవు
► రూ.200 కోట్లు ఖర్చుపెట్టి నంద్యాలలో గెలిచారు
పీలేరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ అందుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం పీలేరు పట్టణ శివారు ప్రాంతం కడప మార్గంలోని ఎంఎం కల్యాణ మండపంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన నవరత్నాల సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దిరెడ్డి మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రతి కుటుంబానికీ లక్షలాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తాయని తెలిపారు
. గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీ సభ్యులు నవరత్నాల పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ రూ.200 కోట్లు డబ్బు ఖర్చు పెట్టి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని విజయం సాధించిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో సుమారు వంద పేజీల్లో 600కు పైగా హామీలు గుప్పించారని, ఇప్పటి వరకు ఒక్కటీ అమలు చేసిన దాఖలాలు లేవని అన్నారు. రూ.84 వేల కోట్లు రైతు రుణమాఫీ చేయాల్సి ఉంటే కేవలం రూ.11 వేల కోట్లు మాత్రమే చేసి ఏదో సాధించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. డ్వాక్రా రుణాలు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అడ్రస్ లేకుండా పోయాయన్నారు.
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ఏ ఆపద వచ్చినా అండగా ఉంటా నని భరోసా ఇచ్చారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి పేదల ఉపాధి కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం టీడీపీ కార్యకర్తలకు ఫలహారంగా మారిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కుమార్‌రాజ, పీలేరు ఎంపీపీ డి.హరిత, కేవీపల్లె జెడ్పీటీసీ జీ.జయరామచంద్రయ్య, పార్టీ కన్వీనర్లు నారే వెంకట్రమణారెడ్డి, ఎం.వెంకట్రమణారెడ్డి, చింతల రమేష్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి, వంగిమళ్ల మధుసూదన్‌రెడ్డి, ఎం.వెంకట్రమణారెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, సీకే.ఎర్రమరెడ్డి, బీడీ నారాయణరెడ్డి, షామి యానా షఫీ, ఎస్.హబీబ్‌బాషా, కె.ఆనంద్, డి.వెంకట్రమణ, వీపీ రమేష్‌రెడ్డి, గాయం భాస్కర్‌రెడ్డి, కొత్తపల్లె సురేష్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.