శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరంగాలు, డప్పుచప్పుళ్లకు బెదరకుండా ప్రత్యేక శిక్షణ పొందిన పొట్టేళ్లు బోనాల జాతరకు సిద్ధమయ్యాయి. ఆది, సోమవారాల్లో జరిగే జాతరలో కీలక ఘట్టాలైన తొట్టెలు, ఫలహారంబళ్ల ఊరేగింపులో పొట్టేళ్లు కీలకపాత్ర పోషించనున్నాయి.
అమ్మవారికి ప్రీతిపాత్రమైన పొట్టేళ్లను తొట్టెలు, ఫలహారంబళ్లు లాగేందుకు వినియోగిస్తారు. బలిష్టమైన శరీర ఆకృతి, మెలితిరిగిన కొమ్ములతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పొట్టేళ్లను పెంచేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. చిలకలగూడ, కిందిబస్తీ, మైలార్‌గడ్డ, వారాసిగూడ, సీతాఫల్‌మండి తదితర ప్రాంతాల్లో బోనాల జాతర కోసం ప్రత్యేకంగా పొట్టేళ్ల పెంపకం చేపట్టి ఆర్థిక లబ్ధి పొందుతున్నారు. జాతర సమయంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు రూ. 3 నుంచి 5 వేలకు పొట్టేళును అద్దెకు ఇస్తుంటామని పెంపకందారులు తెలిపారు.
మార్నింగ్‌వాక్‌తో శిక్షణ..
జనసందోహంతోపాటు హోరెత్తించే డప్పుచప్పుళ్లకు బెదరకుండా ఉండేందుకు పొట్టేళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చిలకలగూడకు చెందిన సాయియాదవ్ వివరించారు. ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్‌వాక్‌కు తీసుకువెల్లడంతో పొట్టేళ్లకు శిక్షణ మొదలవుతుందని, బ్రేక్‌ఫాస్ట్‌గా కందిచున్నీ, ఆవుపాలు ఇస్తామన్నారు. మెలితిరిగేందుకు కొమ్ములకు నువ్వులనూనెతో మాలిష్ చేస్తామని, రెండు పొట్టేళ్లు పెంపకానికి రోజుకు సుమారు రూ. 500 ఖర్చు అవుతుందన్నారు. హాబీగా పొట్టేళ్ల పెంపకం చేపట్టానని, జాతర సమయంలో తొట్టెలు, ఫలహారంబళ్లు లాగేందుకు వినియోగిస్తానని సాయియాదవ్ తెలిపాడు.