మాహె.. రంజాన్ ఆయా
– ప్రారంభమైన రంజాన్ ఉపవాసాలు
– తొలి రోజు కిటకిటలాడిన మసీదులు
అనంతపురం కల్చరల్ : పవిత్ర రంజాన్ మాసం ఆదివారం ఘనంగా ప్రారంభమయింది. మొదటిరోజు కావడంతో అనంతపురం నగరంలోని మసీదుల్లో ఉపవాస దీక్షలు, విశేష ప్రార్థనలతో ప్రత్యేక సందడి నెలకొంది. విద్యుద్దీప కాంతుల నడుమ వింత శోభను సంతరించుకున్న మసీదులు ముస్లింలతో కిటకిటలాడాయి. సాయంత్రం ఉపవాస దీక్ష విరమణతో ఇఫ్తార్ విందులు హల్‌చల్ చేశాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాలు సాయంత్రం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా తెరచి ఉంచారు.
మసీదుల్లో, మదరసాలలో ఖురాన్ ప్రవచనాల తరావి నమాజు కార్యక్రమాన్ని నియమ నిష్టలతో జరుపుకున్నారు. ముఖ్యంగా నగరంలోని లలితకళాపరిషత్ సమీపంలోని ఈద్గా మసీదు, పాతూరు జామియా తదితర చోట్ల మతపెద్దల దివ్య సందేశాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అలాగే ఉపవాసదీక్షలో ఉపయోగించే ఖర్జూరాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇక కర్బానీ కామీఠా, కద్దూరాకీర్, షీర్‌కుర్మా, డబల్‌కామీటా, బిర్యానీ తదితర వంటకాలతో పాటు ఈసారి నగరంలో ప్రత్యేక హలీం హోటల్స్ పెరగడంతో నోరూరిస్తూ పసందైన విందునందిస్తున్నాయి. మసీదుల వద్ద ఇస్లామిక్ సాహిత్యం, మత గ్రంథాలు, ఆధ్యాత్మికతను చాటే వివిధ రకాల వస్తువులు విక్రయించే దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.