రంజాన్‌ షురూ ! | ramzan starts | Sakshi
Sakshi News home page

రంజాన్‌ షురూ !

Published Sat, May 27 2017 9:47 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

కర్నూలులో కనిపించిన నెలవంక

కర్నూలులో కనిపించిన నెలవంక

- పుణ్యాల మూటకట్టుకునే సీజన్‌ పవిత్ర రంజాన్‌ మాసం
- నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం
 
కర్నూలు(ఓల్డ్‌సిటీ): పుణ్యాలు మూట కట్టుకునే పవిత్ర రంజాన్‌ మాసం ఇది. అల్లా ఆరాధనలో గడిపే మాసం కావడంతోనే దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పవిత్ర ఖురాన్‌లో పేర్కొన్న ప్రకారం రంజాన్‌ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం. దీనినే పార్సీ భాషలో రోజా, అరబ్బీలో సౌమ్‌ అంటారు. పవిత్ర ఖురాన్‌ సంపూర్ణంగా భువిపైకి అవతరించిన దినం కూడా రంజాన్‌ మాసంలోనే ఉండటం విశేషం. కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్‌ అనేవి ఇస్లాంకు మూలస్తంభాలు. వీటిలో హజ్‌ తప్ప మిగతా నాలుగు మూల సూత్రాలు అమలయ్యేది ఒక్క రంజాన్‌ నెలలో మాత్రమే. ఆర్థిక స్థోమత కలిగిన వారు తప్పకుండా హజ్‌ యాత్ర నియమాన్ని కూడా సంపూర్ణం చేయాలి. ఇస్లాంలోకి ప్రవేశించే మార్గమే కలిమా. లాఇలాహ ఇల్లాల్లాహ్, ముహమ్మదుర్‌ రసూలుల్లాహ్‌ (సొల్లెల్లాహు అలైహివసొల్లం). ఆ సృష్టికర్తే (అల్లాయే) సమస్త సృష్టికి దైవం. ఆయన ప్రవక్త ముహమ్మద్‌ (సొ.అ.స.) అని అర్థం. ఈ సూత్రాన్ని విశ్వసించడమే కాకుండా ఆచరించాలి. రెండో మూలస్తంభం నమాజ్‌. నమాజ్‌ను నిత్యజీవితంలో రోజుకు ఐదుపూటలు పాటించాలి. రోజా, జకాత్‌ (దానధర్మాలు) వంటివాటికి రంజాన్‌ మాసంలోనే గొప్ప అవకాశం. మరో మూల సూత్రమైన నమాజు లేనిదే రోజా సంపూర్ణం కానేరదు. ప్రతి నమాజులోనూ కలిమా పఠనం జరుగుతుంటుంది. ఒక్క హజ్‌ తప్ప మిగతా మూల స్తంభాలను నిలబెట్టడంలో రంజాన్‌ మాసం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇందులో ఉపవాసాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. 
 
సమయపాలన ముఖ్యం:
ధర్మనిష్ఠతో ఉపవాసాలు ఉండాలి. నిర్ణీత సమయాల్లోనే సహెర్, ఇఫ్తార్‌లు పాటించాలి. అందరూ ఒకేసారి కచ్చితమైన వేళలు పాటించేందుకు వీలుగా కర్నూలు నగరంలో ఔటు పేల్చే విధానం ఉంది. ఉపవాసంలో శరీరానికే కాకుండా మనసుకూ కళ్లెం వేయాల్సి ఉంటుంది. మంచి దృష్టితో చూడాలి. మంచినే పాటించాలి. చెడుకు దూరంగా ఉండాలి. ఐదుపూటలా విధిగా నమాజు చేయాలి. ఖురాన్‌ పఠనం, సారాంశంపై అవగాహన, అల్లా నామస్మరణ, అల్లాచింతన వంటివి విరివిగా చేయాలి. రంజాన్‌ నెలలో చేసే ఏ పవిత్ర కార్యానికైనా 70 రెట్ల పుణ్యం అధికంగా లభిస్తుంది. దీంతో ఈ మాసంలో  దాన ధర్మాలు విరివిగా చేస్తారు. మాసపు చివర్లో ప్రతి ముస్లిం ఫిత్రా దానం చెల్లించుకోవాలి. ఆర్థికస్థోమత కలిగిన వారు జకాత్‌ దానం చేయాలి.
 
 ప్రతి మసీదులోనూ తరావీలో ఖురాన్‌ పఠనం  
కర్నూలు నగరంలోని ప్రతి మసీదులోనూ ఇటీవల తరావీలో ఖురాన్‌ పఠనం తప్పనిసరి చేశారు. పవిత్ర ఖురాన్‌లో 30 పారాలు ఉంటాయి. రోజుకో పారా చొప్పున నెల మొత్తాన్ని పఠిస్తారు. గతంలో బహు కొద్ది మసీదుల్లో మాత్రమే తరావీలో ఖురాన్‌ పఠనం పఠించే వారు. ప్రస్తుత కాలంలో ఖురాన్‌ కంఠస్థం చేసే (హాఫిజ్‌ల) సంఖ్య మెరుగ్గా ఉండటంతో ప్రతి మసీదులోనూ రంజాన్‌ మాసంలో ఒక హాఫిజ్‌ను ఏర్పాటు చేసుకుని నెలమొత్తం మసీదుల్లో సంపూర్ణం ఖురాన్‌ పఠనంతోనే తరావీ నమాజులు పాటిస్తున్నారు. 
 
నియమాలు..
మతగ్రంథాల ప్రకారం వయోజనులైన స్త్రీపురుషులందరూ విధిగా రోజా దీక్ష పాటించాలి. వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్థులు, ప్రయాణంలో ఉన్న వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అయితే వ్యాధిగ్రస్థులు కూడా ఆరోగ్యం చేకూరిన తర్వాత ఆ రోజాలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. రంజాన్‌ అంటే పాపాలను దహించివేయుట అనే అర్థం వస్తుంది. ఉపవాసదీక్షలు అనేవి మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపేవిగా ఉండాలి. సాధ్యమైనంత మేరకు పుణ్యకార్యాలు చేపడుతుండాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement