
తీరని రేషన్ చిక్కులు
* సాంకేతిక సమస్యలతో రేషన్ నిలిపివేత
* అవస్థలు పడుతున్న లక్షా 27వేల మంది లబ్ధిదారులు
* పరిష్కారానికి చర్యలు తీసుకోని యంత్రాంగం
విజయనగరం కంటోన్మెంట్: సాంకేతిక తప్పిదాలు రేషన్ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రకరకాల కారణాలతో వినియోగదారులు రేషన్ కార్డుల్లో పేర్లను కోల్పోతున్నారు. ఆధార్ అనుసంధానం గూర్చి రెండేళ్లుగా కుస్తీలు పడుతున్న అధికారులు ఈపాస్ విధానాన్ని అమలు చేసి ఏడాది దాటిపోయింది. ఇంకా ఆధార్ అనుసంధాన సమస్యలు వినియోగదారులను వదలట్లేదు.
ఇలా రకరకాల సమస్యలతో జిల్లాలోని లక్షా 27వేల మంది లబ్ధిదారులు రేషన్‌సరకుకు దూరమవుతున్నారు. రేషన్ కార్డులో సభ్యుడిగా ఉన్నా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు కావడం లేదు. ఆధార్ లింక్ అవ్వకపోవడంతో కొందరి పేర్లు కీ రిజిస్టర్‌నుంచి తొలగిస్తున్నారు. జిల్లాలోని 6,01,987 తెల్ల రేషన్ కార్డులున్నాయి. అన్నపూర్ణ 839, ఏఏవై 76,009 కార్డులున్నాయి. అన్ని కార్డుల్లో కలిపి 17,79,516 మంది సభ్యులున్నారు. వీరికి ప్రతీ నెలా సరుకులు ఇచ్చే వారు. కానీ గత నెలలో ఆన్‌లైన్లో ఇచ్చే కీ రిజిస్టర్ ద్వారా చూసుకుంటే మొత్తం మూడు రకాల సమస్యలతో మొత్తం లక్షా 27వేల మందికి రేషన్‌ను తొలగించారు.
ఆ మూడు తప్పిదాలివే!
జిల్లాలోని రేషన్ కార్డుల్లో పేర్లున్నా మరో చోట వీరికి పేరుందని చూపిస్తున్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 29వేల మంది ఉన్నారని వారి పేర్లను గత నెలలో తొలగించారు. సరయిన ఆధార్ నంబర్‌తో వస్తే పేర్లు నమోదు చేస్తామనీ, అంతవరకూ రేషన్ నిలిపేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దీంతో వినియోగదారులు నివ్వెరపోతున్నారు. రెండో సమస్య ఏంటంటే.. మూడేళ్ల కిందట ఆధార్ నమోదు కేంద్రాలను మండలాలు, గ్రామాల వారీగా ఏర్పాటు చేశారు.
ఆయా కేంద్రాల్లో పూర్తి స్థాయి పరిజ్ఙానం లేని సిబ్బందిని ఏర్పాటు చేయడంతో వారు తప్పుగా పేర్లు నమోదు చేశారు. ఆధార్ ఎన్‌రోల్ చేసేటప్పుడు ఓ కాలమ్‌లో ‘మీరు ఈ ఆధార్ సంఖ్యను ఏదేని ఇతర కార్యక్రమాలకు అనుసంధానిస్తారా? అని ప్రశ్నించేచోట ఎస్/నో అన్న ఆప్షన్లలో నో అని టైప్ చేయడంతో ఆయా ఆధార్ సంఖ్యలు అథెంటికేషన్ సమస్యలోకి వెళ్లిపోయి ఏ పథకానికీ అనుసంధానం కావడం లేదు. ఇటువంటివి జిల్లాలో 15వేల పైచిలుకు ఉన్నాయి. ఇవి కాకుండా ఆధార్ సంఖ్య ఇప్పటికీ నమోదు చేసుకోలేదని 83వేల మందిని చూపిస్తున్నారు. ఇలా మూడు రకాల సమస్యలతో లక్షా 27వేల మందికి రేషన్ నిలిపివేశారు.
ఇది నిరంతర ప్రక్రియ!
జిల్లాలో ఆధార్ అనుసంధానం దాదాపు పూర్తయింది. అందరూ అనుసంధానం చేసుకున్నారు. మూడు రకాల సమస్యలతో రేషన్ కార్డుల్లో సభ్యులు చోటు కోల్పోతున్నారు. వారెప్పుడయినా ఆధార్‌ను ఆయా కార్డుల్లో అనుసంధానం చేసుకుంటే వారికి ఆ నెల నుంచే రేషన్‌ను పునరుద్ధరిస్తాం. ఇది రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయం కనుక అందరూ పాటించాలి. ఎవరయినా రేషన్ అందని వారుంటే వారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వారి పేర్లను ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాల్సి ఉంటుంది.
- పి నాగేశ్వరరావు, డీఎస్‌ఓ, విజయనగరం