నత్తనడకన రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసు
-
డ్రైవరు, కూలీలు సరే అసలు సూత్రధారులేరీ..
-
అధికార పార్టీలో కీలక నేత తీరుపై సీఎంకు ఫిర్యాదు
మాచర్ల (గుంటూరు జిల్లా): రాత్రంతా వేచిఉండి రేషన్ షాపుల నుంచి వినుకొండకు అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో అసలు సూత్రధారుల విషయంలో పోలీసులు ఇంకా నాన్చుతున్నారు. డిపోల నుంచి రేషన్ బియ్యం తీసుకొచ్చి రాత్రికి రాత్రి లారీకి లోడ్ చేసే శక్తి డ్రై వర్, క్లీనర్, కూలీలకు ఉండదు. ముందుగా అడ్వాన్సులు ఇచ్చి ఆయా డిపోల నుంచి టాటాఏస్ వాహనాల్లో బియ్యం బ్యాగులు తీసుకువచ్చి లోడ్ చేస్తారు. ఇదే సమయంలో బియ్యం బ్యాగ్‌లు తీసుకొచ్చిందెవరు... కూలీలకు నగదు చెల్లించేదెవరు... ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముందుగా మాట్లాడిందెవరూ అనే విషయాలు డ్రై వర్ నుంచి కూలీల వరకు అందరికీ తెలుసు. ఈ విషయంలో పోలీసులు నిర్లిప్తత ప్రదర్శిస్తూ అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ మాట్లాడడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి ఎమ్మెల్యే పట్టించిన డ్రై వర్, క్లీనర్, మరో ముగ్గురు కూలీలు కాకుండా వారి స్టేట్‌మెంట్ ఆధారంగా శ్యామరాజపురం గ్రామానికి చెందిన రామారావు, శివాజీ (శివయ్య)లపై కేసు నమోదు చేశారు. ఐదుగురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎ.ఎస్.ఐ. ఇస్మాయిల్ సాక్షికి తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కీలక పాత్ర పోషిస్తూ, ప్రతి నెల లక్షలాది రూపాయలు సంపాదిస్తున్న ఆ నాయకుడు నామినేటెడ్ పదవిలో ఉండడం వల్లే పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారని అధికార పార్టీలో ఉన్న ఓ మాజీ పోలీసు అధికారి ముఖ్యమంత్రికి ఫిర్యాదుచేశారు. ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులే చెప్పడం గమనార్హం.