రేషన్ షాపుల్లో ఆగని మోసాలు
సాక్షి, విశాఖపట్నం : ఈపాస్, ఐరిస్, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు.. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులో తీసుకొచ్చినా రేషన్‌డీలర్ల మోసాలు మాత్రం ఆగడం లేదు. ఈపాస్‌తో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను అనుసంధానించినప్పటికీ వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. జిల్లావ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వారం రోజులపాటు సాగించిన ఈ తనిఖీల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి. నగరంతోపాటు అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, కె.కోటపాడు, గొలుగొండ, అచ్యుతాపురం, ఎస్.రాయవరం, రోలుగుంట, నాతవరం, అరకు, బొర్రా, సుంకరమెట్ట, బోసుబెడ, శివలింగాపురం వంటì ప్రాంతాల్లోని రేషన్ డిపోలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 10 కేజీల నుంచి 30 కేజీల బియ్యం సరఫరాలో అర కే జీ నుంచి రెండు కేజీల వరకు తక్కువ తూకం ఇస్తున్నట్టుగా గుర్తించారు. కొన్నిచోట్ల తక్కువ తూకం కోసం రాళ్లు కూడా పెట్టి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇలా తూకంలో చేస్తున్న మోసాలకు పాల్పడిన 34 షాపులపై లీగల్ మెట్రాలజీ అధికారులు కేసులు నమోదు చేశారు. లీగల్ మెట్రాలజీ సహాయ సంచాలకుడు పి.సుధాకర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.