ఇష్టంతో చదవాలి
• వేలిముద్రగాళ్లం అయినందునే ఎంతో నష్టపోయాం
• 150 సినిమాల్లో పని చేశాం
• ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్
తాడిపత్రి టౌన్ : "మా జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాం. మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాం. ఎన్నో అనుభూతులు, అనుభవాలు చవి చూశాం. అయితే చదువులేక వేలిముద్రగాళ్లుగా ఎంతో నష్టపోయాం. మా మాదిరి ఎవరూ కాకూడదు. కష్టమైనా ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే ఇష్టంతో చదవాలి’ అని సినిమా ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ అన్నారు. తాడిపత్రి కాల్వగడ్డ వీధిలోని సాయి సిద్దార్ధ కళాశాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ సామాజిక సేవా సంఘం, సాయి సిద్దార్ధ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘బాలికలు–బంగారు భవిష్యత్’ అనే అంశంపై బుధవారం ఏర్పాటు చేసిన సదస్సులో వారు మాట్లాడారు.
సేవా సంస్థ అధ్యక్షుడు శంకర్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగిన కార్యక్రమంలో వారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ... దేవుని దయ, మా కష్టంతో సినీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరామన్నారు. ఐదు సినిమాల్లో హీరోగా, 150 సినిమాల్లో ఫైట్ మాస్టర్లుగా పని చేసినట్లు పేర్కొన్నారు. ఐదు నంది అవార్డులు సొంతం చేసుకున్నట్లు తెలిపారు. నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి సహా ఇతర హీరోల సినిమాల్లో ఫైట్‌మాస్టర్లుగా పని చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం చిరంజీవి 150 చిత్రానికి, బాలకృష్ట 100 చిత్రానికి ఫైట్ మాస్టర్లుగా పని చేస్తున్నామన్నారు. ఫైట్ మాస్టర్లుగా ఎన్నో దేశ విదేశాలు చుట్టొచ్చామని, చదువు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డామని బాధపడ్డారు. సెల్, కంప్యూటర్ మోజులో జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. తల్లిదండ్రులు, గురువులను పూజించాలని పేర్కొన్నారు.