దసరాకు రెడీ! | ready to dasara | Sakshi
Sakshi News home page

దసరాకు రెడీ!

Published Fri, Aug 26 2016 7:53 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

దసరాకు రెడీ! - Sakshi

దసరాకు రెడీ!

  • అదే రోజు నుంచి పరిపాలన ప్రారంభం 
  • 27 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు
  • అధికార యంత్రాంగానికి సీసీఎల్‌ఏ ఆదేశాలు
  • సిబ్బంది విభజన, కార్యాలయాల ఏర్పాటుపై కసరత్తు వేగవంతం 
  • అభ్యంతరాలు, సూచనలను క్రోడీకరిస్తున్న అధికారులు
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతమైంది. విజయదశమి నాటికి 17 కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాల్సిందేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేయడంతో ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదే రోజు 10 పాత జిల్లాలు, 17 కొత్త జిల్లాలు వెరసి 27 జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, డీఆర్వోలుసహా ఆయా జిల్లాల అధికార యంత్రాంగంతో రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీసీఎల్‌ఏ రేమండ్‌ పీటర్, రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు కమ్యూనికేషన్, సమాచార వ్యవస్థనంతా సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. 
    కలెక్టర్, జేసీ కరీంనగర్‌ జిల్లాకే..! 
    రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతాల మేరకు ప్రస్తుత జిల్లాల్లో కొనసాగుతున్న కలెక్టర్లు, జేసీలు, డీఆర్వోలు యథాతథంగా కొనసాగుతారు. కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తయి, ఆయా జిల్లాల్లో పాలన ప్రారంభయ్యే వరకు వీరి సేవలు అవసరమైనందున వీరిని కదిలించకూడదని నిర్ణయించారు. కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభమయ్యాకే వీరి బదిలీలు, పోస్టింగులపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. 
    – జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కసరత్తు పూర్తి చేసే బాధ్యతను ఆయా డివిజన్ల అధికారులకే అప్పగించారు. జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్సు, నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) వంటి కార్యాలయాల ఏర్పాటుతోపాటు కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, డీఆరో నివాస సముదాయాలు, సిబ్బంది కేటాయింపు, అందులో మౌలిక సదుపాయల కల్పన బాధ్యతలను జగిత్యాల సబ్‌కలెక్టర్‌ శశాంక్‌కు అప్పగించారు. ఇప్పటికే జగిత్యాలలోని న్యాక్‌ కేంద్రంలో తాత్కాలికంగా కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శాశ్వత కలెక్టరేట్‌ నిర్మాణానికి ధరూర్‌ క్యాంపు అనువైనదిగా గుర్తించారు. 
    – పెద్దపల్లిలో ఎస్సారెస్పీ కార్యాలయాల్లో కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని తొలుత భావించినప్పటికీ కలెక్టర్‌ నీతూప్రసాద్‌ మాత్రం ఐఐటీ కళాశాల స్థలం అనువైనదిగా భావించారు. ఆ మేరకు ఐఐటీ కళాశాలలో కలెక్టరేట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను స్థానిక రెవెన్యూ డివిజన్‌ అధికారికి అప్పగించారు. ఈ కళాశాలల్లో 20 ఎకరాల పైచిలుకు స్థలం ఉన్నందున శాశ్వతంగా కలెక్టర్‌ భవన సముదాయాన్ని కూడా నిర్మించవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. 
    – మరోవైపు కొత్త జిల్లాలకు సంబంధించి కలెక్టర్, జేసీ, డీఆర్‌వో కార్యాలయాలకు అవసరమైన సిబ్బందిని అదనంగా నియమించుకోవడం మినహా ఇప్పటివరకు కొత్తగా ఈ మూడు జిల్లాలకు సిబ్బందిని కేటాయించలేదు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న సిబ్బందిని మూడు జిల్లాలకు పంపిణీ చేయడం మినహా ఇప్పటికిప్పుడు కొత్తగా ఉద్యోగులను కేటాయించే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలిసింది. 
    – కలెక్టరేట్‌లోని వివిధ శాఖలకు సంబంధించి ఫైళ్లను పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల వారీగా విభజించే ప్రక్రియ వేగవంతమైంది. ఒకటి, రెండ్రోజుల్లో ఆయా జిల్లాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్లు, మండలాల వారీగా ఫైళ్లను క్రోడీకరించి వాటిని ఆయా జిల్లా కేంద్రాలకు పంపేందుకు వీలుగా చర్యలు చేపట్టనున్నారు. అందుకోసం డివిజన్లు, మండల అధికారులను కలెక్టరేట్‌కు పిలిపించుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. 
    కుప్పలు తెప్పలుగా అభ్యంతరాలు
    కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజుల్లో 5వేల పైచిలుకు అభ్యంతరాలు వ్యక్తమవగా, అందులో కరీంనగర్‌ జిల్లా నుంచే 1700 పైచిలుకు అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో 1200కుపైగా అభ్యంతరాలు జగిత్యాల జిల్లాలో కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ వచ్చినవేనని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేసి కోరుట్లలో డివిజన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న అభ్యంతరాలను ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా విభజిస్తున్న అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోవడం సాధ్యమవుతుందా? లేదా? అనే అంశాలను సీసీఎల్‌ఏకు పంపుతున్నారు. ఉదాహరణకు... అభ్యంతరాలు, సూచనల్లో ఎక్కువగా సిరిసిల్ల జిల్లా, కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు సంబంధించినవే ఉంటున్నాయి. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు ప్రక్రియ చేపట్టినప్పటికీ... ఇతర మండలాల ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో కొత్త జిల్లా ఏర్పాటు సాధ్యం కాక ఆ అంశాన్ని ప్రభుత్వం పక్కనపెట్టింది. వాటిపై మళ్లీ అభ్యంతరాలు వస్తున్నప్పటికీ సిరిసిల్ల జిల్లా ఏర్పాటు సాధ్యం కాదనే అంశాన్నే సీసీఎల్‌ఏకు పంపాలని అధికారులు భావిస్తున్నారు. అట్లాగే మెట్‌పల్లిలో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నందున అక్కడినుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుట్లను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే అవకాశాల్లేవనే విషయాన్ని సీసీఎల్‌ఏకే తెలియజేయనున్నారు. ఈ రెండింటి తరువాత హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కొనసాగించాలని, వెల్గటూర్‌ను పెద్దపల్లి జిల్లాలో కలపాలనే సూచనలు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement