'ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి'
ఆదివాసీ ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేయాలని కోదండరాం అన్నారు.
ఖమ్మం : ఆదివాసీ ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేయాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఖమ్మం జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, సంక్షేమ పథకాలు దక్కుతాయని కోదండరాం తెలిపారు. పోడు భూములపై హక్కు కల్పించాలని, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితమైందని, ఇప్పుడు అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని సూచించారు. ప్రభుత్వం ఉమ్మడి వనరులను కాపాడాలన్నారు.
2015 నుంచి రైతులకు ఇవ్వాల్సిన పంటల ఇన్‌పుట్ సబ్సిడీని మంజూరు చేయాలని, రుణాలన్నీ మాఫీ చేసి, కొత్త లోన్లను మంజూరు చేయాలని, రైతులకు ఖరీఫ్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.. రైతుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్2న హైదరాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు జేఏసీ మౌనదీక్షకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ పాపారావు, కో కన్వీనర్లు జి.సత్యనారాయణ, మార్టిన్, మురళీతారకరామారావు, నాగేంద్రరావు, శంకర్‌రావు, రవి, విశ్వం పాల్గొన్నారు.