
విశాఖ ఐటీ సెజ్‌పై రియల్ కన్ను
నాన్ ఎస్‌ఈజెడ్‌గా మార్చేందుకు పన్నాగం
ప్రభుత్వ పెద్దలతో ఒప్పందం
కేంద్రం కాదన్నా త్వరలో జీవో జారీ!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఐటీ రంగానికి ప్రోత్సాహం ముసుగుతో ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జీవోల జారీకి రంగం సిద్ధం చేశారు. విశాఖపట్నం మధురవాడలోని ఐటీ హిల్-2 ప్రభుత్వ పెద్దల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. గతంలో ప్రభుత్వం నుంచి ఎకరా రూ. 10 లక్షల రేటుకు పొందిన భూములను రూ. 5 కోట్ల చొప్పున విక్రయానికి మార్గం సుగమం చేస్తున్నారు.
చట్టం ప్రకారం విక్రయానికి వీల్లేదు..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో విశాఖ మధురవాడలోని హిల్-1, హిల్-2, హిల్-3లను ఐటీ హిల్స్‌గా ప్రకటించారు. ప్రభుత్వం కేటాయించే భూములు దుర్వినియోగం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఈజెడ్‌ల చట్టాన్ని అనుసరించి విశాలమైన హిల్-2ను ఓ జీవో ద్వారా ప్రత్యేక ఆర్థికమండలి(ఎస్‌ఈజెడ్)గా ప్రకటించారు. ఆ చట్టం నిబంధనలను ఉల్లంఘించడానికి అవకాశం లేదు. భూములు పొందిన సంస్థ కంపెనీని ఏర్పాటు చేసి నిర్వహించాలి. ఆ స్థలాలను ఇతరులకు లీజుకు ఇవ్వడంగానీ విక్రయించడంగానీ చేయకూడదు. అప్పట్లో ఎకరా మార్కెట్ విలువ రూ. 2 కోట్లు ఉండగా ఐటీ కంపెనీలకు అండగా ఉండాలని రూ. 10 లక్షలకు వైఎస్ ప్రభుత్వం 13 సంస్థలకు స్థలాలు కేటాయించింది. అయితే ఇక్కడస్థలాలు పొందిన కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించలేదు. మరికొన్ని సంస్థలు కంపెనీలు ఏర్పాటు చేసినప్పటికీ నత్తనడకన కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
హిల్-2పై ‘రియల్’ చూపు!
ప్రస్తుత ప్రభుత్వ పెద్దల చూపు మధురవాడ హిల్-2పై పడింది. అతి తక్కువ ధరకు పొందిన ఆ స్థలాలను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని కొందరు భావించారు. ఇక్కడ ప్రస్తుతం ఎకరా మార్కెట్ ధర రూ. 5 కోట్లుపైగా పలుకుతోంది. దాంతో తాము పొందిన భూములను విక్రయమో, లీజుపేరుతోనో వేరేవారికి బదలాయించాలని భావించారు. హిల్-2పై స్థలాలు కలిగిన సంస్థల యాజమానుల్లో.. ఓ ప్రజాప్రతినిధితోపాటు 2014 ఎన్నికల్లో టీడీపీకి నిధులు సమకూర్చినవారు ఉన్నారు. కానీ రియల్ వ్యాపారానికి వారికి ఎస్‌ఈజెడ్ నిబంధనలు అడ్డంకిగా మారాయి. దాంతో వారు ప్రభుత్వ పెద్దతో ‘మాట్లాడి’ హిల్-2ను నాన్ ఎస్‌ఈజెడ్‌గా ప్రకటించమని కోరగా ఆయన సరేనన్నారు.
మరో జీవో తెద్దాం..
ఈ నేపథ్యంలో హిల్-2ను నాన్ ఎస్‌ఈజెడ్‌గా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. ఎస్‌ఈజెడ్‌గా ప్రకటించిన ఏ ప్రాంతాన్నీ నాన్ ఎస్‌ఈజెడ్‌గా మార్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అయినా ప్రభుత్వ పెద్ద కేంద్ర ప్రభుత్వాన్ని మాయ చేసి హిల్-2ను నాన్ ఎస్‌ఈజెడ్‌గా మార్పించేందుకు పన్నాగం పన్నారు.
‘అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా హిల్-2ను ఎస్‌ఈజెడ్‌గా ప్రకటించింది. కాబట్టి మనం ఆ జీవోను రద్దు చేస్తూ మరో జీవో ద్వారా నాన్ ఎస్‌ఈజెడ్‌గా ప్రకటిస్తే సరిపోతుంది’ అని ప్రభుత్వ పెద్ద ఐటీ శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల సీఐఐ సదస్సు సందర్భంగా సూచించా రు. ముఖ్యనేత ఆదేశాలతో ఐటీ అధికారులు ఆ మేరకు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించారు. తద్వారా ఐటీ అభివృద్ధికి కేటాయించిన భూములను ప్రభుత్వ పెద్ద అనుయాయులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేయడానికి రంగం సిద్ధమైపోయింది. త్వరలో హిల్-2ను నాన్ ఎస్‌ఈజెడ్‌గా ప్రకటిస్తూ జీవో జారీ కానుంది.