ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన వైఖరి గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమని రాజ్యసభ మాజీ సభ్యుడు
మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ
గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన వైఖరి గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ అన్నారు. శనివారం రాత్రి ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం శాంతి యుత సహజీవనం సాగించడం వల్ల ప్రచార కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ ఫ్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయలేకపోయారని తెలిపారు. ఈ విధానం వల్ల టీడీపీ కేడర్‌కు ఆయన ధైర్యాన్ని ఇవ్వలేకపోవడంతోపాటు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు దీటుగా ప్రచారం చేయలేకపోయారని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రులు ఇద్దరూ స్నేహంగా ఉన్న సమయంలో మనం స్థానికులతో ఎందుకు వివాదాలకు పోవాలని భావించి అక్కడి ఏపీ ఓటర్లు పార్టీని దృష్టిలో ఉంచుకోకుండా స్థాని క పరిస్థితులకు అనుగుణంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించారని యలమంచిలి అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు ఊహించి నవేనని, ఒక ప్రాంతీయపార్టీ మరో రాష్ట్రం స్థానిక ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవని, చరిత్ర ఇది చెబుతోందని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయంసింగ్, బీహార్‌లో లాలూప్రసాద్‌యాదవ్‌లు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పటికీ, పక్క రాష్ట్రాల్లో పార్టీని విస్తరింప చేయలేకపోయారని తెలిపారు. సీఎం చంద్రబాబు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా పక్క రాష్టంలో పార్టీని బలపరిచే దిశగా ప్రయత్నాలు చేయడం ఇప్పుడు అభిలషణీయం కాదని తెలిపారు.