కృషికి గుర్తింపు
ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్
ఈ–నామ్ అమలులో దేశంలోనే మొదటి స్థానం
కలెక్టరేట్‌లో అవార్డు ప్రదానోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన దూరదర్శన్
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) :
జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(ఈ–నామ్) అమలులో నిజామాబాద్ మార్కెట్ యార్డు ఉత్తమ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కలెక్టర్ యోగితారాణా ప్రధానమంత్రి అవార్డు ఫర్ ఎక్స్‌లెన్సీ ఇన్ పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్–2017 అవార్డు అందుకున్నారు. అలాగే ప్రశంసాపత్రంతోపాటు రూ.10 లక్షల బహుమతిని పొందారు.
ఈ–నామ్ అమలులో దేశంలోనే మొదటి స్థానంలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి సంగయ్య, భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, జిల్లా ఆడిట్ అధికారి రాము ఢిల్లీకి వెళ్లారు. అయితే కలెక్టర్ ఉత్తమ అవార్డును పొందే దృశ్యాలను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ప్రగతిభవన్‌లో జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, ఈ– నామ్ ఇన్‌చార్జి ఎల్లయ్య, బోధన్ సబ్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఇన్‌చార్జి డీఆర్వో రమేష్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర ఉద్యోగులు ప్రొజెక్టర్‌ల ద్వారా దృశ్యాలను వీక్షించారు. కలెక్టర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇద్దరు ప్రధాని చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న సమయంలో ప్రగతిభవన్‌లో ఉన్న అధికారులు, ఉద్యోగులు అంతా లేచి చప్పట్లు కొట్టారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అలాగే కలెక్టర్‌కు పలువురు అధికారులు వాట్సప్‌లో శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్‌పై ప్రశంసల జల్లు
అవార్డు ప్రదానోత్సవం ముగిసిన అనంతరం ప్రగతిభవనలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు కలెక్టర్ యోగితారాణాపై ప్రశంసల జల్లు కురిపించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర జిల్లా అధికారులు ఒక్కొక్కరుగా కలెక్టర్ చేస్తున్న కృషిని వెల్లడించారు. కలెక్టర్ తన పాలన కాలంలో శాఖలవారీగా సాధించిన పురోగతి తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల శాతం పెంపు, ఫసల్ బీమా యోజన అమలులో క్షేత్రస్థాయి పరిశీలన తదితర ప్రగతి సాధించిన పథకాలపై మాట్లాడారు. కలెక్టర్ యోగితారాణా జిల్లాకు రావడం మన మందరం, ప్రజలు అదృష్టంగా భావించాలన్నారు.