నిజమాబాద్ మార్కెట్‌లో దగా
► చార్జీల పేరిట భారీగా వసూళ్లు
► క్వింటాల్‌కు రూ.400 ఖర్చు
జగిత్యాల అగ్రికల్చర్ ( ఆదిలాబాద్): జిల్లాలో పసుపు మార్కెట్ లేకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను నిజామాబాద్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అక్కడ వ్యాపారులు మార్కెట్‌లో ఛార్జీల పేరిట రైతులను దోచుకుంటున్నారు. క్యాష్ కటింగ్, అడ్తి, హమాలీ ఛార్జీల పేరున మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నారు. మార్కెట్ ఫీజు ఎగవేసేందుకు, తెల్లకాగితాలపై పద్దులు రాసి ఇస్తున్నారు. జగిత్యాల డివిజన్‌లోని జగిత్యాల కోరుట్ల, మెట్‌పల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, రాయికల్ మండలాల్లో పసుపును అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. జిల్లాలో సాగు అయ్యే పంటల్లో దాదాపు 75 శాతం ఈ మండలాల నుండే ఉంటుంది. ప్రస్తుతం పసుపు పంట తవ్వి, ఉడకబెట్టి, ఆరబెట్టి, పాలిషింగ్ చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు.
ప్రస్తుతం క్వింటాల్ రేటు రూ.6-7 వేల మధ్యనే పలుకుతుంది. ధరలు తక్కువగా ఉండటంతో పాటు ఖర్చులు ఎక్కువగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా, ఆ స్థాయిలో రేట్లు పెరగడం లేదు. ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇటీవల నిజమాబాద్ మార్కెట్‌కు వెళ్లిన జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు తీపిరెడ్డి రత్నాకర్‌రెడ్డి తన గోడును వెళ్లబోసుకున్నాడు.
31 క్వింటాళ్లకు రూ.13వేల ఖర్చు
రత్నాకర్ రెడ్డి అనే రైతు తనకు పండిన 31.64 క్వింటాళ్ల పసుపు పంటను రెండు రోజుల క్రితం నిజమాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. ఓపెన్ మార్కెట్‌లో ధర క్వింటాల్‌కు రూ 6500 ధర పలికింది. రైతు లెక్క ప్రకారం రూ. 2,05,660 డబ్బులు రావాలి. కాని, తన డబ్బులు తనకు ఇచ్చేందుకు, వడ్డీకి ఇచ్చినట్లుగా క్యాష్ కటింగ్ పేర, వచ్చిన డబ్బుల్లో రూ 4,113 (2 శాతం), అలాగే అడ్తి, హమాలీ, దించిన కూలీ, కుప్ప పోసిన కూలీ, చాట పేరిట రూ 4,774 (దాదాపు 2.3 శాతం), పసుపు ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేందుకు సంచి కిరాయి (ఒక్క బస్తాకు రూ 8) రూ 384, ఒక్క బస్తాకు నిజమాబాద్‌కు లారీ కిరాయి (ఒక్క బస్తాకు రూ 65) రూ 3120 ఇలా రైతుకు రూ 12,391 ఖర్చు వచ్చింది. రెండు రోజుల పాటు భోజన ఖర్చు, రవాణా పేరిట మరో రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. అంటే, రైతుకు మొత్తంగా రూ 13,391 ఖర్చు వచ్చింది. రైతుకు వచ్చిన మొత్తం డబ్బు రూ 2,05,660 నుండి, రైతు ఖర్చు రూ 13,391 తీసివేయగా, చేతికి వచ్చింది రూ 1,92,269. వర్షాభావ పరిస్థితుల్లో రైతు ఏడాది పాటు కష్టపడి పండించిన పంటను మార్కెట్‌లో నిలువు దోపిడి చేస్తున్నారు.
అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు
జిల్లా నుండి పసుపు రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఏ రేటు ఎంత అని అడిగినా ఎ వ్వరు పట్టించుకోవడం లేదు. తెల్లకాగితాలపై ఇష్టం వచ్చినట్లు కట్ చేసి, మిగిలిన డబ్బులను చేతిలో పెడుతున్నారు. - తీపిరెడ్డి రత్నాకర్‌రెడ్డి, పసుపు రైతు
మా డబ్బులు మాకు ఇవ్వమంటే క్యాష్ కటింగ్
పసుపును అమ్మిన డబ్బులను మాకు ఇవ్వమంటే నూటికి రెం డు రూపాయలు క్యాష్ కటింగ్ చేస్తున్నారు. ఏ మార్కెట్ నిబంధనలో క్యాష్ కటింగ్ లేదు. రైతుల దగ్గర బలవంతంగా దోచుకుంటున్న ఎవ్వరు పట్టించుకోవడం లేదు. - తిరుపతి రెడ్డి, లక్ష్మీపూర్