వైద్యసిబ్బందిని నియమిస్తాం
-
వైద్య విధాన పరిషత్ జిల్లా కో–ఆర్డినేటర్ సుబ్బారావు
రాపూరు: రాపూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బందిని నియమిస్తామని వైద్యవిధాన పరిషత్ జిల్లా కో–ఆర్డినేటర్ సుబ్బారావు పేర్కొన్నారు. రాపూరు ప్రభుత్వ వైద్యశాలను శుక్రవారం తనిఖీ చేసిన జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైద్యసిబ్బంది లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా కోఆర్డినేటర్ రాపూరు ప్రభుత్వ వైద్యశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశాలలో సరిపడా వైద్యులను నియమించినట్లు తెలిపారు. కొంత మంది సెలవులో వెళ్లడంతో సమస్య తలెత్తిందన్నారు. నర్సులు కొరత ఉందని, డిప్యుటేషన్‌పై నర్సులను నియమిస్తామన్నారు. వైద్యశాల భవనం నిర్మాణంలో ఉన్నందున పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించలేకపోతున్నామన్నారు. భవనాలు అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. ఆయన వెంట వైద్యులు శ్రీనివాసరావు, ప్రతిమ ఉన్నారు.