రెడ్ అలర్ట్
ఉగ్రవాదుల కదలికలపై జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణా పుష్కరాలు, పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
రద్దీ ప్రాంతాలో విస్తృత తనిఖీలు
– ఛత్తీస్‌ఘడ్ నుంచి అసాంఘిక శక్తులు జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల హెచ్చరిక
– డీజీపీ కార్యాలయ ఉత్తర్వులతో ఎస్పీ అప్రమత్తం
– పుష్కరాలు, స్వాతంత్య్ర వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన
కర్నూలు:
ఉగ్రవాదుల కదలికలపై జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణా పుష్కరాలు, పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి అసాంఘిక శక్తులు జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో ఎస్పీ ఆకె రవికష్ణ రెడ్‌అలర్ట్ ప్రకటించారు. పుష్కర బందోబస్తు విధుల్లో భాగంగా శ్రీశైలం వెళ్తుండగా, బుధవారం సాయంత్రం డీజీపీ కార్యాలయం నుంచి ఎస్పీకి ఉత్తర్వులు అందడంతో వెంటనే కర్నూలుకు చేరుకొని నగరంలోని పోలీసు అధికారులతో డీపీఓలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. భద్రత విషయాలపై పోలీసు అధికారులు ప్రతి కానిస్టేబుల్‌కు బ్రీఫింగ్ ఇవ్వాలన్నారు. జిల్లాకు వచ్చే వీవీఐపీలకు రక్షణ కల్పించాలన్నారు. నగరంలో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి మెరుగుపర్చాలని డీఎస్పీ రమణమూర్తికి సూచించారు. వజ్ర వాహనంతో నగరంలో కవాతు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అనుమానితులు కనిపిస్తే సమీపంలోని పోలీసులకు, డయల్ 100, పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లకు కానీ సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెక్‌పోస్టుల్లో వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, హైవే ఢాబాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అంతకుముందు పెరేడ్ మైదానంలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లు, రిహార్స్‌ను ఎస్పీ పరిశీలించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ రమణమూర్తి, సీఐలు శ్రీనివాసులు, ములకన్న, నాగరాజురావు, మహేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, ఆర్‌ఐ రంగముని, ఆర్‌ఎస్‌ఐలు మోహన్‌రెడ్డి, రఘురాముడు, శివయ్యశెట్టి తదితరులు పాల్గొన్నారు.
నగరంలో విస్తృత తనిఖీలు
ఎస్పీ ఆకె రవికష్ణ ఆదేశాల మేరకు డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో బుధవారం నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. సీఐలు ములకన్న, నాగరాజు రావు, మహేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌రావు సిబ్బందితో వారి స్టేషన్ల పరిధితో పాటు రైల్వే స్టేషన్, కొత్తబస్టాండు, రాజ్‌విహార్, మౌర్యాఇన్ సర్కిల్ ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు నిర్వహించారు.