దారుణం: జామాయిల్‌ తోటలోకి తీసుకెళ్లి.. | Constable Who Forcibly Abducted Girl Molested | Sakshi

దారుణం: జామాయిల్‌ తోటలోకి తీసుకెళ్లి..

Published Sat, Jan 11 2020 9:39 AM | Last Updated on Sat, Jan 11 2020 10:07 AM

Constable Who Forcibly Abducted Girl Molested - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఒంగోలు: ఏకాంతంగా ఉన్న జంటపై ఓ కానిస్టేబుల్‌ దాడి చేసి యువతిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత ధైర్యం తెచ్చుకున్న బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరకు నిందితుడు కటకటాల పాలయ్యాడు. ఈ అమానుష ఘటన తాలూకా పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఇదీ..జరిగింది 
పట్టణానికి చెందిన యువతికి తల్లిదండ్రులు లేరు. ఓ షోరూంలో పనిచేస్తుంటుంది. ఆమెకు వినయ్‌ అనే యువకుడు స్నేహితుడు. ఇద్దరూ ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మంగమూరు రోడ్డు నుంచి పేర్నమిట్ట మార్గంలోకి వెళ్లారు. ఆ మార్గంలో ఓ జామాయిల్‌ తోట వద్ద ఆగి మాట్లాడుకుంటున్నారు. అక్కడకు ఓ వ్యక్తి వచ్చాడు. మీకు తోట వద్ద ఏం పనంటూ బెదిరించాడు. మీరెవరని ప్రశ్నించడంతో పాడు యువకుడిపై చేయి కూడా చేసుకున్నాడు. తాను కొత్తపట్నం కానిస్టేబుల్‌నంటూ ఐడీ కార్డు చూపించడంతో జంట నిజంగానే భయపడింది. యువకుడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. అనంతరం ఆమెను ఇంటి వద్ద దించుతానంటూ బెదిరించి మరీ బైకు ఎక్కించుకుని అక్కడి నుంచి ఆమెను మరో రెండు కిలో మీటర్లు తీసుకెళ్లాడు.

అక్కడ మరో జామాయిల్‌ తోటలో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువకుడు తన స్నేహితులకు ఫోన్‌ చేసి వారితో కలిసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. చివరకు ఆమె నుంచి ఫోన్‌ రావడంతో హుటాహుటిన అక్కడకు వెళ్లి ఆమెపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్నాడు. ఎవరి ఇంటికి వారు చేరుకున్నా కానిస్టేబుల్‌ వ్యవహారం మాత్రం వారిని మానసికంగా వేధించింది. వారు ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించడంతో పాటు ఘటనకు కారకుడు కొత్తపట్నం పోలీసుస్టేషన్‌ కానిస్టేబుల్‌ రాజుపాలెం ఆనంద్‌గా గుర్తించి అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్లు 341, 323, 363, 376 కింద కేసులు నమోదు చేశారు.  

గతంలోనూ ఇదే తరహా కేసు నమోదు  
ఆనంద్‌ 2009 బ్యాచ్‌ కానిస్టేబుల్‌. ఇతనిపై 2013లో ఒక కేసు నమోదైంది. ఆ ఘటనలో బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులే అతడిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. బీటెక్‌ చదువుతున్న జంట ఒంటరిగా శివారు ప్రాంతంలో ఉన్న సమయంలో కానిస్టేబుల్‌ ఆనంద్‌ ఆ యువతిని తనతో పాటు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడనేది అప్పట్లో వచ్చిన ఆరోపణ. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఒక యువతిని బాధితురాలిగా పేర్కొన్నారు. యువతి తనపై ఎటువంటి దాడి జరగలేదని పేర్కొనడంతో 2015లో కేసు కొట్టేశారు. దీంతో మళ్లీ పోలీసు శాఖలోకి ప్రవేశించాడు.
 
శాఖాపరమైన చర్యలకు ఎస్పీ ఆదేశం  
ఈ కేసులో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ స్పందించారు. కానిస్టేబుల్‌ ఆనంద్‌ను అరెస్టు చేయడంతో పాటు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం వైద్యశాలకు పంపించారు. అంతే కాకుండా ఆనంద్‌పై శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక అనంతరం అతడిని పోలీసు శాఖ నుంచి డిస్మిస్‌ చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all
Advertisement