తడిసి మోపెడు!
- గన్‌జాటం!
- తెరపైకి మళ్లీ రెయిన్‌గన్లు!
- వేరుశనగకు రక్షకతడులు అందించే యత్నం
- నిర్వహణకు ఏఓల వెనుకడుగు
- మైక్రో ఇరిగేషన్‌కు అప్పగించే యోచనలో ప్రభుత్వం
- ఈ నెల 14న నిర్వహణపై వర్క్‌షాపు.. ఆపై పంపిణీ
- గత ఏడాది భారీగా గోల్‌మాల్
- కర్ణాటక రైతులకు అమ్ముకున్న టీడీపీ నేతలు
- ఉన్నవి ఇళ్లలో దాచుకుని అధికారులపై రుబాబు
ప్రభుత్వం మరోసారి రెయిన్‌గన్లతో హడావుడి చేసేందుకు సిద్ధమవుతోంది. గతేడాది 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. జూలై ఆఖరు, ఆగస్టులో వర్షాభావంతో పంట ఎండిపోయింది. జూలైలోనే రేయిన్‌గన్లు జిల్లాకు చేరినా.. సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని భావించడం, కృష్ణా పుష్కరాల హడావుడిలో ఆయన రాకపోవడంతో పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఆగస్టు 15న సీఎం జిల్లాకు వచ్చినా పర్యటన హడావుడిగాముగిసింది. చివరకు పత్తిపాటి పుల్లారావుతో ఆగస్టు 22న రేయిన్‌గన్‌లను పంపిణీ చేశారు. అప్పటి పంటలు పూర్తిగా ఎండిపోయాయి.
ఆగస్టు 28న సీఎం ‘అనంత’ పర్యటనకు వచ్చి పంట ఎండిన సంగతి తనకు తెలీదని, లేదంటే పంటను కాపాడే వాళ్లమని చెప్పారు. ‘మిషన్–1’ పేరుతో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జిల్లాలోనే మకాం వేయడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఓ ప్రణాళిక లేకుండా పంటసంజీవని పరికరాలను ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు. పంటలను కాపాడిన లెక్కలు కూడా ఇష్టారీతిన నమోదు చేశారు. గతేడాది ‘అనంత’లో మాత్రమే 5,887 రెయిన్‌గన్లు, 5,495 స్ప్రింక్లర్లు, 4,17,000 పైపులు, 4478 ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేశారు. వీటికి రూ.67 కోట్లు ఖర్చు చేశారు.
రికవరీకీ ఆపసోపాలు
రెయిన్‌గన్ల పంపకం పూర్తిగా టీడీపీ నేతల కనుసన్నల్లో సాగింది. వారివద్దకు వెళ్లిన వారికే రేయిన్‌గన్‌లు ఇచ్చారు. మిషన్–1, మిషన్–2 పూర్తయిన తర్వాత రేయిన్‌గన్ల రికవరీని అధికారులు గాలికొదిలేశారు. అధికారపార్టీ నేతలు కర్ణాటకలోని రైతులకు విక్రయించారు. ఈ విషయం పత్రికల ద్వారా వెలుగులోకి రావడంతో అధికారులు రికవరీకి నడుం బిగించారు. మెజార్టీ పరికరాలు రైతుల వద్ద లేవని, అధికారపార్టీ నేతల ఇళ్లలోనే ఉన్నాయని గ్రహించారు. కొందరు పరికరాలు ఇచ్చేశారు.. ఇంకొందరు అతిబలవంతంగా పగిలిపోయిన పైపులు, ప్రభుత్వం పంపిణీ చేసిన పైపులు కాకుండా వేరే పైపులు, పనిచేయకుండా తుక్కుగా మారిన ఆయిల్ ఇంజన్లు ఇచ్చారు. రివకరీకి వెళ్లిన ఏఓలు, ఎంపీఈఓలను అధికార పార్టీ నేతలు దుర్భాషలాడారు. కొందరు మహిళలు ఏడ్చుకుంటూÐð వెనుదిరిగిన వారూ ఉన్నారు. అధికారులు రికవరీ చేసినవి కాకుండా ఇంకా 800 రెయిన్‌గన్లు, 1473 స్ప్రింక్లర్లు.. 91,880 పైపులు, 414 ఇంజన్లు రికవరీ కావాలి. వీటికి రికవరీకీ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. కేసులు నమోదు చేస్తే బదిలీ తప్పదని ఏఓలను ఎమ్మెల్యేలు హెచ్చరించారు. దీంతో అధికారులంతా రైతులపై పోలీసు స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది నిర్వహణకు ఏఓలు ససేమిరా:
ఈ ఏడాది రేయిన్‌గన్ల ద్వారా రక్షకతడులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనిపై ఈనెల 14న అనంతపురంలో వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 80వేల హెక్టార్లలో వేరుశనగ సాగయింది. గతేడాది ఈ సమయానికి 2.50–3లక్షల హెక్టార్లలో సాగు చేశారు. వర్షాభావంతో విత్తుపడటం లేదు. సాగైన పంటకు నీళ్లివ్వాలంటే బోర్లలోనూ నీళ్లు లేవు. బోర్లలో నీరున్న రైతుల నుంచి పక్క రైతుకు ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఈ అంశంలో రైతుల మధ్య గతేడాది ఘర్షణ వాతావరణం తలెత్తింది. ట్యాంకర్ల నుంచి సరఫరా చేయాలనుకున్నా ఎక్కడా నీళ్లు అందుబాటులో లేవు. దీనికి తోడు రెయిన్‌గన్లు ఇవ్వడం, పంటలను కాపాడటం, కాపాడినా, లేకపోయినా, తప్పుడులెక్కలు రాయడం ఏఓలు తమ వల్ల కాదని తేల్చిచెబుతున్నారు. రెయిన్‌గన్లకు జియో ట్యాగింగ్ ఇచ్చామని, కర్నూలు నుంచి మరో 3088 రేయిన్‌గన్లు, 1223 ఆయిల్ ఇంజిన్లు, 4995 స్ప్రింక్లర్లు, 2,01,568 పైపులను తీసుకొస్తున్నామని వ్యవసాయాధికారులు చెబుతున్నా.. ససేమిరా అంటున్నారు. దీంతో వీటి నిర్వహణను మైక్రోఇరిగేషన్ కంపెనీలకు ఇవ్వాలని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. దీనిపై 14 నిర్ణయం తీసుకోనున్నారు.
జిల్లాలో పంట సంజీవని పరికరాల పరిస్థితి ఇదీ:
రెయిన్‌గన్లు స్ప్రింక్లర్లు పైపులు ఆయిల్ ఇంజన్లు
పంపిణీ చేసినవి 5887 5495 417000 4478
రికవరీ అయినవి 5087 4022 325120 4064
రికవరీ కావల్సినవి 800 1473 91,880 414
పంటసంజీవని ప్రారంభిస్తాం: శ్రీరామ్మూర్తి, జేడీఏ
పంట సంజీవనిపై ఈ నెల 14న వర్క్‌షాపు నిర్వహిస్తున్నాం. రివకరీ, కర్నూలు నుంచి వచ్చే పరికరాలపై చర్చిస్తాం. ఈ ఏడాది జియో ట్యాగింగ్ పెట్టాం. వీటి నిర్వహణను మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. దీనిపై 14 నిర్ణయం వస్తుంది. ఆ వెంటనే రక్షకతడులు ప్రారంభిస్తాం.