భారత్‌తో సంబంధం మరింత బలోపేతం
యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా
సాక్షి, హైదరాబాద్: తమ దేశానికి కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత కూడా అమెరికా-ఇండియాల మధ్య సంబంధాల బలోపేతానికి చర్యలు యథాతథంగా కొనసాగుతాయని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఆర్థిక, రక్షణ కొనుగోళ్లు తదితర రంగాల్లో భారత దేశంలో భాగస్వామ్యాన్ని అమెరికా కోరుకుంటోందన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల పరిశీలన కోసం హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో అధికార, వ్యాపార రంగ ప్రముఖులకు అల్పాహార విందు ఇచ్చింది.
ఈ కార్యాక్రమంలో కేథరిన్ హడ్డా మాట్లాడారు. వచ్చే ఏడాది ఇరు దేశాల మధ్య పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, వీసాల జారీని సరళీకృతం చేస్తామన్నారు. అమెరికాలో 1.2 లక్షల మంది భారత విద్యార్థులు నివాసముంటున్నారని తెలిపారు. అర్హులైన విద్యార్థులు సైతం వీసా కోసం తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పిస్తుండటంతోనే సమస్యలు వస్తున్నాయన్నారు.