చిత్రం దర్శకుడు, సంగీత దర్శకుడితో సెల్పీ దిగుతున్న అభిమానులు
– తిరుపతిలో జ్యో అచ్యుతానంద చిత్ర బృందం
తిరుపతి కల్చరల్: చక్కటి హాస్యాన్ని పంచుతూ ప్రేక్షకులను ఆనందభరితం చేస్తున్న జ్యో అచ్యుతానంద చిత్రం పట్ల ప్రేక్షకుల ఆదరణ మరువలేనిదని ఆ చిత్రం డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ తెలిపారు. జ్యో అచ్యుతానంద చిత్రం విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా ఆ చిత్ర బృందం సోమవారం శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసింది. ఈ సందర్భంగా తిరుపతిలోని బిగ్‌సీ థియేటర్‌లో ప్రేక్షకులతో కలసి చిత్రాన్ని తిలకించింది. ఈ సందర్భంగా దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యో అచ్యుతానంద అనే పేరు చిత్రానికి పెట్టినప్పుడే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని సంకల్పించామన్నారు. వెంకన్న ఆశీస్సులు, ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందన్నారు. హాస్యంతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రమని తెలిపారు. త్వరలో హీరో నారా లోహిత్‌తో కలిసి తిరుపతి పర్యటనకు రానున్నట్లు తెలిపారు. సంగీత దర్శకుడు కల్యాణ్‌రామన్ మాట్లాడుతూ ఈ చిత్రానికి తాను అందించిన పాటలకు మంచి స్పందన వస్తోందన్నారు. ఈ స్పందనతో భవిష్యత్‌లో మరింత మంచి సంగీతంతో కూడిన పాటలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రం కెమెరామాన్ వెంకట్ సీ.దిలీప్ తదితరులు పాల్గొన్నారు.