చెరుకుగడలా నిటారుగా,‘నవ్వించడానికే’ అన్నట్టుగా ఉంటారు అవసరాల శ్రీనివాస్. ఆయనను చూస్తే హాలీవుడ్ హాస్య ద్వయం లారెల్-హార్డీలో లారెల్ గుర్తొస్తాడు. శ్రీనివాస్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆర్జించిన పేరు మాత్రం ఎక్కువ. ఇప్పుడందరికీ షాకిస్తూ.. ‘ఊహలు గుసగుసలాడే’తో డెరైక్టర్‌గా కూడా మారిపోయాడు. అవసరానికి నటునిగా మారి.. ఇప్పుడు తెలుగు తెరకు అవసరం అన్నట్లుగా ఎదిగిన ఈ ప్రవాస భారతీయుడితో కాసేపు...
చెప్పండి సార్... దర్శకునిగా తొలి అనుభవం ఎలా ఉంది?
చాలా బాగుంది... క్రియేటివ్ కంట్రోల్ అంతా మన చేతిలోనే ఉంటుంది. నిజంగా ఇదో కిక్కు.
అసలు డెరైక్టర్ అవ్వాలని ఎందుకనిపించింది?
నిరుత్సాహానికి గురైన ప్రతిసారీ... ఉత్సాహంగా ముందుకు దూకడం నాకు అలవాటు. ‘నువ్వు నటుడివి అవడం ఏంటి?’ అన్నారు అప్పట్లో చాలామంది. దాంతో, నటుడినై చూపించాను. ‘నీకు డెరైక్షన్ దేనికి?’ అన్నారు కొంతమంది. డెరైక్టర్ అయి చూపించాను. అంతే.
డెరైక్షన్ అంటే దానికి కొన్ని అర్హతలుండాలేమో కదా!
నాకు లేవని ఎందుకు అనుకుంటున్నారు! నేను కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా కూడా పనిచేశాను. ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రానికైతే... రచయితల టీమ్‌లో నేనూ ఒకణ్ణి. డెరైక్టర్‌కు ఉండాల్సింది విజన్. అది నాకుంది.
అమెరికాలో ఉన్నత చదువులు చదివిన మీకు అసలు సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది?
ఇంటర్మీడియట్‌లో బైపీసీ చదువుదామనుకున్నా. ఇంట్లోవాళ్లు బలవంతంగా ఎంపీసీ గ్రూపు అంటగట్టారు. ఆ పైన ఇంజినీరింగ్ పూర్తవగానే పై చదువులకు అమెరికా పంపారు. ఇష్టం లేని కాపురం చేయలేంగా... చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. దాంతో అమెరికాలో ఫిల్మ్ స్కూల్‌లో చేరా. ‘అష్టాచమ్మా’కు సెలక్టయ్యా. ఆ తర్వాత తెలిసిందే.
మరి... డెరైక్టర్‌గా తొలి అవకాశం?
సినిమాలు చేస్తూనే ఓ వైపు కథలు రాసుకుంటూ ఉండేవాణ్ణి. అలా రాసుకున్న కథే ‘ఊహలు గుసగుసలాడే’. చాలామంది కథ బాగుందన్నారు కానీ, అవకాశం ఇవ్వలేదు. నేను సినిమా తీయలేనని వాళ్ళ నమ్మకం. కానీ... నిర్మాత కొర్రపాటి సాయిగారు కథ వినగానే ‘చేస్కో’ అని అవకాశం ఇచ్చేశారు. స్క్రిప్టే ఈ సినిమాకు స్టార్. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. త్వరలో విడుదల చేస్తాం.
డెరైక్టర్‌గా కొనసాగుతారా?
ఓ వైపు క్యారెక్టర్లు చేస్తూనే మరో వైపు డెరైక్షన్ చేస్తా. కొర్రపాటి సాయిగారిదే మరో సినిమా చేయాలి. స్క్రిప్ట్ వర్క్‌కు నేను ఎక్కువ టైమ్ తీసుకుంటా. తొలి ప్రాధాన్యం మాత్రం నటనకే. నాకు నటన అంటే ప్రాణం.
కామెడీ హీరోగా బావుంటారు. ఆ ప్రయత్నం చేయొచ్చుగా?
అప్పుడప్పుడైతే ‘ఓకే’.‘అమృతం చందమామలో’ హీరోని నేనేగా. అయితే, అలాగే కొనసాగలేను. హీరో అంటే సినిమా భారమంతా మోయాలి. అంత బలం నాకు లేదు.
నటునిగా మీకంటూ డ్రీమ్‌రోల్ ఏమైనా ఉందా?
నెగిటివ్ షేడ్సున్న పాత్ర చేయాలనుంది. అలాంటివి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డెరైక్టర్‌గా చాలా చేయాలి. ‘శ్రీనివాస్ ఇలాంటి సినిమాలే చేస్తా’డనే పేరు నాకొద్దు. ‘ఎలాంటి సినిమా అయినా చేయగల’డనే పేరు కావాలి.
అది సరే.. కానీ... మీరు ‘రాకెట్‌బాల్’ బాగా ఆడేవారట కదా?
అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి తెలుగువాళ్లందరం కలిసి అప్పుడప్పుడు క్లబ్‌కి వెళ్లి అమెరికన్లతో సరదాగా ఆడేవాణ్ణి. పోనుపోనూ ఆ ఆటపై ఆసక్తి పెరిగింది. స్టేట్ లెవల్‌లో స్వర్ణ, రీజినల్ లెవల్‌లో రజత పతకాలు సాధించా. మార్చి 1న మన దేశంలో తొలిసారిగా ‘ఇండియా ఓపెన్ రాకెట్‌బాల్ సింగిల్స్ చాంపియన్‌షిప్’ జరిగింది. అదీ హైదరాబాద్‌లో! అప్పుడు దక్షిణ కొరియాపై ఆడాం. మళ్లీ అక్టోబర్‌లో అమెరికా టోర్నమెంట్ ఉంది. వెళ్లాలి. అప్పటివరకూ సినిమాలతోనే బిజీ.
- బుర్రా నరసింహ
నేను తీయలేనని వాళ్ల నమ్మకం!
Published Sat, May 31 2014 11:22 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM
Advertisement
Advertisement