పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ
పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ
Published Mon, May 8 2017 9:42 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM
- పీఆర్ డిప్లొమా ఇంజినీర్ల ఆవేదన
- సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నపం
కర్నూలు(అర్బన్): డిప్లొమా ఇంజినీర్లు ఏఈలుగా సర్వీసులో చేసి అదే పోస్టులో పదవీ విమరణ చేయాల్సిన దౌర్భాగ్యస్థితిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే మోహన్, జీఎస్ గౌస్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని పీఆర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మొత్తం 489 డిప్యూటీ ఈఈ పోస్టుల్లో 1:3 నిష్పత్తి ప్రకారం డిప్లొమా ఇంజినీర్లు 122 మంది ఉండాలన్నారు. ప్రస్తుతం 48 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఈఈ ప్రమోషన్ చానల్‌ను కూడా ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిందన్నారు. 58 ఈఈ పోస్టుల్లో 1:3 నిష్పత్తి ప్రకారం 14 మంది డిప్లొమా ఈఈలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కరు కూడా లేక పోవడం దారుణమన్నారు. అనేక మంది ఏఈలకు సీనియారిటీ జాబితా లేదని, సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్, అటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేళ్ళ వర్తింపు, టీఏ బిల్లులు నెలనెలా రాకపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు.
విజయవాడలో 40వ వార్షికోత్సవం...
ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్ జ్యోతి కన్వెన్షన్‌లో సంఘం 40వ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు జిలానీబాషా, మాధవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement