సమావేశంలో మాట్లాడుతున్న ఈవో సాంబశివరావు
– టీటీడీ ఈవో సాంబశివరావు
– 25 లోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశం
– గరుడ సేవ రోజున శ్రీవారి మెట్టు మార్గంలో 24 గంటలూ భక్తులకు అనుమతి
– 7 లక్షల లడ్డూలు నిల్వకు ఆదేశం
సాక్షి, తిరుమల:
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అన్నారు. మంగళవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఈనెల 25వ తేదిలోపు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. భక్తుల దర్శనం కోసం గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే ప్రారంభిస్తామన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను ఆలయ వీధుల్లోని గ్యాలరీల్లోకి అనుమతిస్తామన్నారు. వారికి మంచినీరు, ఆహారం సరఫరా చేస్తామన్నారు. గరుడ వాహన సేవ రోజున భక్తులు శ్రీవారి మెట్టుమార్గంలో అధిక సంఖ్యలో నడిచివచ్చే అవకాశం ఉన్నందున ఆరోజు రాత్రి ,పగలూ అనుమతిస్తామన్నారు. అందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. నిత్యాన్నప్రసాద భవనంలో కూడా రాత్రి 1 గంట వరకు అన్నప్రసాదాలు వడ్డించే చర్యలు చేపట్టామన్నారు. అదే రోజు ఆలయంలో మూలమూర్తి దర్శనం కూడా అత్యధిక సంఖ్యలో భక్తులకు కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 7 లక్షల లడ్డూలు నిల్వ ఉండే చర్యలు చేపట్టామన్నారు.
16న జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ నిర్వహిస్తామన్నారు. ఇక 27వ తేదిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామన్నారు.